వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరుజిల్లా పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. గతంలోనూపలు కేసులు నమోదైనా.. వాటిలో అరెస్టు చేసే అవకాశం తక్కువగా ఉండడంతో పోలీసులు కేవలం నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బలమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం గమనార్హం. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 132, 126, 351, 189, రెడ్ విత్ 190 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
వీటిలో 351 కింద అంబటిని అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. పోలీసులను దూషించడం, వారి విధులకు ఆటంకాలు కలిగించడమే కాకుండా.. ప్రజలకు ఇబ్బంది కలిగింది, వారిని రెచ్చగొట్టేలా వ్యవహరించారని తెలిపారు. అంబటిపై కేసులు నమోదు చేశామన్న సీఐ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలు నిర్వహించేందుకు పోలీసుల అనుమతులు తీసుకోవాలని.. కానీ, అలా తీసుకోకుండా పోలీసులను నిలువరించే ప్రయత్నం చేశారన్నారు.
ఏం జరిగింది?
బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, మాజీ మంత్రులు.. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. అయితే .. దీనివల్ల పేదలకు మేలు జరగదని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ నిరసనల్లో పలు చోట్ల నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిపై కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే అంబటిపై కూడా కేసులు నమోదయ్యాయి. అయితే.. ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. కానీ.. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆయనను అరెస్టు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.