రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18 వేల బుక్ మై షో టికెట్లు అమ్ముడుపోవడం శుభపరిణామం. రేపటికి ఈ నెంబర్ లో గణనీయమైన మార్పు రానుంది. ఏపీ తెలంగాణ జిఓలు ఎక్కువ ఆలస్యం చేయకుండా త్వరగా రావడం సానుకూలంగా మారింది. హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలతో పాటు చిన్న బిసి సెంటర్లలో కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఆంధ్రవైపు కొన్ని ప్రాంతాల్లో గవర్నమెంట్ అనుమతించిన 600 కాకుండా 400 రూపాయలు టికెట్ రేట్లు పెట్టడం లాంటి చర్యలు ప్రేక్షకుల కోణంలో పాజిటివ్ గా మారుతోంది.
ఇక్కడంతా బాగానే ఉంది కానీ అఖండ 2కి ఇతర రాష్ట్రాల్లో వస్తున్న పోటీ, వసూళ్ల పరంగా ప్రభావం చూపించేలా ఉంది. కర్ణాటకలో రేపు దర్శన్ డెవిల్ పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది. ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన పండగ వాతావరణమే కనిపిస్తోంది. హీరో జైల్లో ఉండటంతో ఫ్యాన్స్ ఇంకా ఘనంగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కటకటాల్లో ఉన్నా సరే తమ అభిమానం చెక్కుచెదరలేదని చూపించటానికి పడుతున్న తాపత్రయం విమర్శలకు సైతం గురవుతోంది. అయితే రిషబ్ శెట్టి, శివరాజ్ కుమార్ లాంటి సెలబ్రిటీలు డెవిల్ కు శుభాకాంక్షలు తెలపడం ద్వారా దర్శన్ కు మద్దతు ఇవ్వడం గమనార్హం.
తమిళనాడులో ఇదే 12 రజనీకాంత్ ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ పడయప్ప కొత్త సినిమా రేంజ్ లో మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఫ్యాన్స్ సంబరాలు మాములుగా లేవు. కార్తీ వా వాతియర్ (అన్నగారు వస్తారు) కు సైతం మంచి థియేటర్లు దక్కాయి. వీటి మధ్య అఖండ 2 నెగ్గుకురావాల్సి ఉంటుంది. డెవిల్, పడయప్పాలు కలిపి రెండు రాష్ట్రాల్లో ఎంత లేదన్నా పది నుంచి పదిహేను కోట్ల దాకా ఓపెనింగ్ తెచ్చుకునేలా ఉన్నాయి. బాలయ్యకు ఇది సమస్యనే. ఇంకోవైపు బాలీవుడ్ లో దురంధర్ జోరు కొనసాగుతోంది. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా డిసెంబర్ 12 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అఖండ తాండవమే వినిపించబోతోంది.