వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు.. ప్రకటనలు ఇచ్చే విషయంలోనూ.. కార్యక్రమాలకు పిలిచే విషయంలోనూ ఇలానే చేశారన్నవాదన ఉంది. అంతేకాదు.. ఒక్కసారి 2019, మేలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. ఆయన చేసిన ప్రసంగం వింటే కొన్ని ఆశ్చర్యకర ప్రకటనలు.. పిలుపులు గోచరిస్తాయి.
రెండు పత్రికలు.. మూడు చానెళ్లను తన ప్రసంగంలో ప్రస్తావించిన(అప్పట్లో) జగన్.. ఆ పేపర్లను చదవొద్దని.. ఆ చానెళ్లను చూడొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడిగా.. ఒక పార్టీకి అధినేత ఆయన ఎలాంటి పిలుపు అయినా ఇవ్వొచ్చు. కానీ.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. అదే వేదికపై గవర్నర్ సహా పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్(అప్పటి) సమక్షంలోనే తెలుగు మీడియాపై అక్కసు వెళ్లగక్కారు.
అనంతరం.. దీనికి ముందు కూడా.. జాతీయ మీడియాను జగన్ పిలుచుకుని ప్రెస్ మీట్లు పెట్టేవారు. ఎన్నికల సమయంలో అయితే.. ప్రత్యేకంగా వాటికి ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో జాతీయస్థాయిలో జగన్ పేరు వినిపించింది. అంతెందుకు.. కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. తన పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి విషయం తెలిసిందే.(2024 చివరిలో).
ఆ కార్యక్రమాల కవరేజీకి కూడా.. జాతీయ మీడియాను జగన్ ఆహ్వానించారు. ఇలా.. తనకు అవసరం .. అవకాశం ఉన్న ప్రతిసారీ జాతీయ మీడియాను వాడుకునే జగన్.. ఇప్పుడు అదే మీడియాపై కరప్షన్ (అవినీతి-అమ్ముడు పోవడం) అనే వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. దీనిని జాతీయ మీడియా సంఘాలు కూడా ఖండించాయి. కానీ.. తాను సరైన విధానాలు అనుసరిస్తే.. ఏ మీడియా మాత్రం విమర్శిస్తుంది..? అనేది ఆలోచన చేయాలి.
ఒకవేళ విమర్శించినా.. అపవాదులు ఉన్నాయని భావించినా.. వివరణ ఇచ్చుకునేందుకు జగన్ కు అవకాశం ఉంది. కానీ, ఆయన అమ్ముడు పోయారంటూ.. చేసిన వ్యాఖ్యలతో జాతీయ మీడియా జగన్‌పై నిప్పులు చెరుగుతోంది. ఒకప్పుడు నిలబెట్టిన మీడియాపైనే జగన్ ఇలా ఆరోపణలు చేయడం పట్ల ఎడిటర్స్ గిల్డ్ కూడా ఆక్షేపణ వ్యక్తం చేయడం గమనార్హం.