నిన్న విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు సినిమాలోని మీసాల పిల్ల లిరికల్ సాంగ్ ప్రోమో ఇరవై నాలుగు గంటల్లోనే పది మిలియన్ల డిజిటల్ వ్యూస్ తో దూసుకుపోతోంది. అయితే సోషల్ మీడియాలోని ఒక వర్గం ఎప్పటిలాగే అనిల్ రావిపూడి టేకింగ్ మీద టార్గెట్ చేయడం కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ సెట్ టీవీ సీరియల్ లా ఉందని, చిరంజీవితో ఈ వయసులో ఇలాంటి స్టెప్స్ వేయించడం ఏమిటనే తరహాలో మళ్ళీ పాత రాగం పాడుతోంది. నిజానికి ముప్పై సెకండ్ల ప్రోమో మీద తీవ్ర శల్య పరీక్ష అక్కర్లేదు. మొత్తం పాట చూశాక ఒక అభిప్రాయానికి వస్తే బాగుంటుంది కానీ ఇలా సెకండ్ల వీడియోకే ఇంత రాద్ధాంతం అనవసరం.
ఒకటి మాత్రం నిజం. అనిల్ రావిపూడిని తక్కువంచనా వేయడానికి లేదు. సంక్రాంతికి వస్తున్నాంలో గోదారి గట్టు మీద రామచిలకవే ప్రోమో వచ్చినప్పుడు కూడా కామెంట్స్ వచ్చాయి. కట్ చేస్తే 2025 టాప్ చార్ట్ బస్టర్ అయ్యింది. విజువల్ గానూ ఆకట్టుకుంది. అంతకు ముందు ఎఫ్3, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2, రాజా ది గ్రేట్ టైంలోనూ అనిల్ మీద కామెంట్స్ చేసినవాళ్లు లేకపోలేదు. కానీ వీటిలో ఏ ఒక్కటి ఫ్లాప్ కాలేదు. యావరేజ్ కాదు. అయితే సూపర్ హిట్ లేదంటే బ్లాక్ బస్టర్. అంతకంటే తక్కువ ఫలితం ఏదీ అందుకోలేదు. రాజమౌళి తర్వాత అంత సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్నది అనిల్ రావిపూడికే.
ఇదంతా తననేదో సమర్ధించడానికో లేదా డిఫెండ్ చేయడానికో కాదు. మాస్ పల్స్ మీద అనిల్ పట్టు మామూలుది కాదు. కొందరు క్రింజ్ అన్నా సరే దాంతోనే క్లాస్ మాస్ ని మెప్పించగలిగే సత్తా ఉంది. ఒకప్పటి ఈవివి, జంధ్యాల, రేలంగి నరసింహారావు మార్కు చూపిస్తోంది తనొక్కడే. అందుకే హీరో ఎవరైనా అంత బాగా కనెక్ట్ కాగలుగుతున్నాడు. భగవంత్ కేసరి నేషనల్ అవార్డు సాధించడం వెనుక క్రెడిట్ ఎవరికి దక్కుతుంది. ఆచితూచి సినిమాలు చేస్తున్న వెంకటేష్ మూడోసారి తనతో జట్టు కడుతూ వాటిలో ఒక క్యామియో అంటే అంతకంటే సాక్ష్యం ఏం కావాలి. సో ఇప్పటికేదో అనుకున్నా అనిల్ లెక్కలు వేరే లెవెల్ లో ఉంటాయి.