జాతిరత్నాలు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అనుదీప్ కేవీ. అంతకుముందే పిట్టగోడ అనే సినిమా తీసినా.. అది రిలీజైనట్లు కూడా జనాలకు తెలియదు. జాతిరత్నాలు పెద్ద హిట్టవడం, కామెడీ సినిమాల్లో ట్రెండ్ సెట్ చేయడంతో అనుదీప్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అతను ఏదైనా ఈవెంట్లో పాల్గొన్నా, షోకు హాజరైనా కూడా నవ్వులు పూయడంతో యూత్‌లో తనకు మంచి క్రేజ్ వచ్చింది. కానీ తర్వాతి చిత్రం ప్రిన్స్‌తో అనుదీప్ బాగా డిజప్పాయింట్ చేశాడు. అందులో తన పంచులు అనుకున్నంతగా పేలలేదు.
తర్వాత రవితేజ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేసినా వర్కవుట్ కాలేదు. దీంతో గ్యాప్ వచ్చేసింది. చివరికి యంగ్ హీరో విశ్వక్సేన్‌తో ఫంకీ అనే వెరైటీ టైటిల్‌తో సినిమా మొదలుపెట్టాడు అనుదీప్. ఈ సినిమా టీజర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. శుక్రవారం నిరీక్షణకు తెరపడింది. కామెడీ పంచులతో నిండిన టీజర్‌ను నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లాంచ్ చేసింది.అనుదీప్ అనగానే అందరూ ఆశించేది కామెడీనే. తన మార్కు పంచులే. వాటితోనే టీజర్‌ను తీర్చిదిద్దాడు అనుదీప్.
మనం చిన్నపుడు అమ్మా నాన్నలు చెప్పిన మాట వినలేదు అని ఒక క్యారెక్టర్ అంటే.. అమ్మా నాన్న ఏం చెప్పారండీ అని ఇంకో క్యారెక్టర్ అడగడం.. అందుకు బదులుగా ఫస్ట్ క్యారెక్టర్.. చెప్పాం కదా వినలేదని అంటూ బదులివ్వడంతో టీజర్ మొదలైంది. ఇక్కడ్నుంచి కామెడీ పంచులన్నీ ఇలా తింగరి తింగరిగానే సాగాయి. డైలాగుల్లో ఏదో మర్మం ఉన్నట్లు మొదలవడం.. చివరికి చూస్తే ఏం లేనట్లు అనిపించడం.. అందులోనూ ఫన్ దాగుండడం.. ఇదీ అనుదీప్ మార్కు.
టీజర్ అంతా ఇలాంటి పంచులతోనే సాగిపోయింది. విశ్వక్‌తో పాటు హీరోయిన్ కాయదు లోహర్ ఆకర్షణీయంగా కనిపించారు. ఇద్దరికీ జోడీ బాగానే కుదిరింది. విశ్వక్ ఇందులో డైరెక్టర్ పాత్ర చేయడం.. సినిమా తీయడం మీదే కామెడీ అంతా నడవడం విశేషం. ఐతే టీజర్లోని పంచుల పట్ల సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. ఇలాంటి కామెడీ, పంచులు జబర్దస్త్ స్కిట్లలో ఎన్నిసార్లు చూడలేదు.. ముఖ్యంగా ఆటో రాంప్రసాద్ పంచులనే ఇక్కడా చూస్తున్నట్లుంది అంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. కానీ కొందరు మాత్రం అనుదీప్ నుంచి ఆశించేది ఈ కామెడీనే అంటూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.