ఏపీకి గ్రేట్ గ్రీన్ వాల్(హరిత గోడ) అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అడవులు జాతీయ ఆస్తి అని పేర్కొన్న ఆయన… వాటిని కాపాడుకోవడం అందరి బాధ్యతని తెలిపారు. అటవీ సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. అటవీ రక్షణలో రాజకీయలకు తావుండదన్న డిప్యూటీ సీఎం.. ప్రతి అంగుళం అమూల్యమేనని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడవుల రక్షణ విషయంలో దిశానిర్దేశం చేస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో అటవీ శాఖ మంత్రిగా వ్యవహరించిన ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు.
“గత ప్రభుత్వ(వైసీపీ) హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే తన సొంత ఇలాకాలోని అటవీ భూములను ఇష్టానుసారం ఆక్రమించుకున్నారు. అప్పటి వ్యవస్థలో అధికారులు ఎందుకు మిన్నకుండిపోయారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. భారీ ఎత్తున దోచుకున్నా.. ఎవరూ మాట్లాడలేదు. అలాంటి తప్పిదాలు కూటమి ప్రభుత్వంలో జరగడానికి వీల్లేదు. పార్టీలు, వ్యక్తులకు అతీతంగా అటవీ భూమి అంగుళం కబ్జా అయినా వేగంగా స్పందించాల్సిన బాధ్యత అటవీ అధికారులకు ఉంది“ అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. శుక్రవారం కృష్ణా జిల్లా గన్నవరం మండల, కొండపావులూరులోని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్ లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అడవుల్ని సంరక్షించాలంటే అటవీ శాఖ అధికారుల భద్రత ప్రధానమైందంటూ.. కొన్నాళ్ల కిందట శ్రీశైలం ఎమ్మెల్యే అనుచరులు అటవీశాఖ అధికారులపై చేసిన దాడిని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అటవీ సిబ్బంది భద్రత పట్ల కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి స్పష్టతతో ఉందన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను ఇబ్బంది పెట్టినా, దాడులకు పాల్పడినా అది ఏ స్థాయి వ్యక్తులైనా వారిని ఉపేక్షించం. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. “శ్రీశైలం ఘటన నా దృష్టికి వచ్చిన వెంటనే నిజానిజాలు తెలుసుకున్నాను. సిబ్బందికి తగిన న్యాయం జరిగేలా చూశాం.“ అని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 22 శాతం భూ భాగంలో నోటిఫై చేసిన అడవులు ఉన్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. అయితే.. డి-నోటిఫై చేసిన దానితో కలిపితే మొత్తం 31 శాతంగా ఉండవచ్చునని అంచనా వేశారు. అయితే, ఉన్న అడవుల్లో ఎంత పచ్చదనం ఉంది? ఆక్రమణల నేపథ్యంలో ఎంత శాతం అడవులు మిగిలాయి అన్నది ప్రశ్నార్థకంగా ఉందన్నారు. ఆక్రమణలు ఎక్కడ ఉన్నా, చేసింది ఎవరైనా ఉపేక్షించవద్దని దిశానిర్దేశం చేశారు. 2047 నాటికి రాష్ట్ర భూ భాగంలో 50 శాతం పచ్చదనంతో నిండేలా పని చేయాలన్నారు. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మనదేనన్న పవన్ కల్యాణ్.. తీరం వెంబడి ఖాళీ ప్రదేశాల్లో తాటి చెట్లు, పాల్మిరా వంటి మొక్కల పునరుద్దరణపై దృష్టి సారించి ఆకు పచ్చని గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలన్నారు.