నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భారీ విరాళం లభించింది. 100 కోట్ల రూపాయల విరాళం ఇవ్వనున్నట్టు దుబాయ్ కు చెందిన శోభా గ్రూప్ సంస్థ చైర్మన్ పీఎన్సీ మీనన్ తెలిపారు. ఈ నిధులతో ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని నిర్మించాలని మీనన్ సూచించారు. ప్రస్తుతం దుబాయ్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్ర బాబును కలుసుకున్న మీనన్.. ఈ మేరకు ప్రతిపాదించారు. బుధవారం సాయంత్రం దుబాయ్‌లో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన మీనన్.. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు.
అయితే.. తాము లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని.. ఇది ప్రపంచ స్థాయిలో ఉండాలని ఆయన సూచించారు. దీనిని సీఎం చంద్రబాబు స్వాగతించారు. ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. గ్రంథాలయం నిర్మాణానికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించటంపై ధన్యవాదాలు తెలిపారు. అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నామని సీఎం ఆయనకు వివరించారు.
రాజధాని నిర్మాణంలో శోభా రియాల్టి సంస్థ కూడా భాగస్వామి కావాలని సీఎం ఆహ్వానించారు. ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని కోరారు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయిలో నగరాలు నిర్మితం అవుతున్నాయని వాటితో సమానంగా మౌలిక సదుపాయాలతో అమరావతిని నిర్మిస్తున్నట్టు సీఎం వివరించారు. గ్రీన్ ఎనర్జీకి రాష్ట్రాన్ని చిరునామాగా చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు శోభా గ్రూప్ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు.
అమరావతిలో క్వాంటం వ్యాలీ, విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు అవుతోందని చంద్రబాబు చెప్పారు. ఇక తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో రానున్న రోజుల్లో అనేక మార్పులు రానున్నాయని… మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. కాగా.. ఇప్పటి వరకు అమరావతికి అనేక ప్రాజెక్టులు వచ్చినా.. కీలకమైన గ్రంథాలయం ఏర్పాటు శోభ గ్రూప్ ముందుకు రావడం విశేషమనే చెప్పాలి.