hyderabadupdates.com movies `అమ‌రావ‌తి` ప‌నులా.. ఇక‌, చిటెక‌లో!

`అమ‌రావ‌తి` ప‌నులా.. ఇక‌, చిటెక‌లో!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించిన ప‌నులు పూర్త‌వ్వాలంటే.. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌యాస‌లు ప‌డాల్సి వ‌స్తోంద‌న్న‌ది వాస్త‌వం. ప్ర‌ధాన కార్యాల‌యాల‌న్నీ.. త‌లా ఒకచోట ఉండ‌డంతో అమ‌రావ‌తిలో భూములు కొనాలన్నా.. విక్ర‌యించాల‌న్నా.. ఆయా కార్యాల‌యాల చుట్టూ తిరిగే ప‌రిస్థితి ఉంది. దీంతో ప‌నులు స‌కాలంలో పూర్తి కావ‌డం లేద‌న్న‌ది కూడా వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో స‌ర్కారు కొన్నాళ్లుగా.. చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. తాజాగా అమ‌రావ‌తిలోనే అన్నీ అయ్యేట్టుగా కార్యాల‌యాన్ని అందుబాటులోకి తెచ్చారు.

ఏపీ పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ ప్ర‌ధాన కార్యాలయాన్ని అమ‌రావ‌తిలోని రాయ‌పూడిలో ఏర్పాటు చేశారు. దీనిని సీఎం చంద్ర‌బాబు ఈనెల 13న‌(సోమ‌వారం) ప్రారంభించ‌నున్నారు. ఫ‌లితంగా రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించిన అన్ని ప‌నులు, కార్య‌క‌లాపాలు ఇక్క‌డ నుంచే జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌జా రాజ‌ధానిలో పాల‌నా సౌల‌భ్యం కొరకు అన్ని హెచ్ వో డీలు ఒకే చోటకు చేర‌నున్నాయి. త‌ద్వారా ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులో ఉండేలా స‌రికొత్త హంగుల‌తో నిర్మించిన భ‌వ‌నాల నుంచే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

ముఖ్యంగా అమ‌రావ‌తికి భూములిచ్చిన‌ రైతులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు విజయవాడ‌, మంగ‌ళ‌గిరిలోని కార్యాల‌యాల చుట్టూ ప‌నులు మానుకుని రావాల్సి వ‌చ్చేంది. ఈ కార్యాల‌యం అందుబాటులోకి రావ‌డంతో వారు ఇక్క‌డే త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌తిబింబించేలా భ‌వ‌నం ముందు `ఏ`అక్ష‌రంతో ఎలివేష‌న్ చేశారు.

అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలో మున్సిప‌ల్ శాఖ ప్ర‌ధాన కార్యాలయం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. వైసీపీ హ‌యాంలో ఆగిపోయినా.. ఇటీవ‌ల దీనిని పూర్తి చేశారు.  

మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 7 భవనంగా రూపొందించిన ఈ నిర్మాణంలో పార్కింగ్ కోసం 1.36 ఎకరాలు, ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు, ఎస్టీపీ 0.39 ఎకరాల్లో నిర్మాణం చేశారు. దీనిలోనే పుర‌పాల‌క శాఖ మంత్రి అందుబాటులో ఉంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ ఈఎన్ సీ, ఏడీసీఎల్ అధికారులు కూడా ఇక్క‌డ నుంచే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

Related Post