స్పై యూనివర్స్ పేరుతో తీసిన కథనే మళ్ళీ మళ్ళీ తీస్తూ క్యాష్ చేసుకోవాలని చూసిన యష్ రాజ్ ఫిలింస్ కు వార్ 2 పెద్ద స్ట్రోక్ ఇచ్చింది. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ కాబట్టి కథా కథనాలు ఎలా ఉన్నా జనం ఎగబడి చూస్తారనే లెక్క అడ్డంగా తప్పడంతో అంత అనుభవమున్న నిర్మాత ఆదిత్య చోప్రా సైతం షాక్ తిన్నారు. నిజానికి టైగర్ 3 మొదటి హెచ్చరిక జారీ చేసినప్పటికీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. పాత పద్ధతిలోనే రొటీన్ కంటెంట్, విఎఫెక్స్ తో వార్ 2ని జనం మీదకు వదిలారు. తిక్క లేచిన ఆడియన్స్ అంత క్రేజీ కాంబో తెర మీదున్నా మొహమాటం లేకుండా నో అన్నారు.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే యష్ రాజ్ ఫిలింస్ తీస్తున్న మరో స్పై మూవీ అల్ఫా డిసెంబర్ 25 నుంచి వాయిదా వేసుకుని వచ్చే ఏడాది ఏప్రిల్ కు షిఫ్ట్ అయిపోయింది. అలియా భట్ లేడీ గూఢచారిగా నటించిన ఈ యాక్షన్ డ్రామాలో వామికా గబ్బి మరో ప్రధాన పాత్ర పోషించగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. పోస్ట్ పోన్ కు కారణం అధికారికంగా చెప్పలేదు కానీ గ్రాఫిక్స్ కు సంబంధించిన అవుట్ ఫుట్ అంత సంతృప్తికరంగా రాకపోవడంతో పాటు స్టోరీ పరంగా తలెత్తిన కొన్ని లోపాలు సరిచేయడానికి టైం అవసరం కావడంతో వాయిదా వేశారని ముంబై టాక్. ఇదంతా వార్ 2 ప్రభావమే అంటున్నారు.
ఒకవేళ వార్ 2 కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే అల్ఫా చెప్పిన టైంకే వచ్చేది. పఠాన్ 2, టైగర్ వర్సెస్ పఠాన్ కు రంగం సిద్ధమయ్యేది. కానీ ఇప్పుడివన్నీ పెండింగ్ లో పడుతున్నాయి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లు సైతం ఈ కొనసాగింపుల పట్ల ఏమంత ఆసక్తిగా లేరట. ఎంతసేపూ ఒకే తరహా విలన్ ని పెట్టి కేవలం ఆర్టిస్టులను మార్చుకుంటూ కథలు చెబుతున్న విధానం క్రమంగా ఫేడ్ అవుట్ అవుతుందని గుర్తించారు కాబోలు. ఆదిత్య చోప్రా మాత్రం ఇప్పుడప్పుడే స్పై వరల్డ్ మీద ఆశలు వదులుకునేలా లేరట. అల్ఫా ఖచ్చితంగా హిట్టయి ఈ జానర్ కు పునర్ వైభవం తెస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారట.