అల్లరి నరేష్.. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోల్లో ఒకడు. రాజేంద్ర ప్రసాద్ జోరు తగ్గిపోయాక కొన్నేళ్ల పాటు శూన్యత ఆవహించిన తెలుగు కామెడీని ముందుకు తీసుకెళ్లడంలో నరేష్‌దే కీలక పాత్ర. ఒక పదేళ్ల పాటు తన కామెడీ సినిమాలు తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. తొలి సినిమా ‘అల్లరి’తో మొదలుపెట్టి తొట్టి గ్యాంగ్, అత్తిలి సత్తిబాబు, కితకితలు, బెండు అప్పారావు, సుడిగాడు.. ఇలా అనేక కామెడీ చిత్రాలతో అతను ప్రేక్షకులను మామూలుగా నవ్వించలేదు.
కానీ ఒక దశ దాటాక అతడి కామెడీ సినిమాలను జనాలకు మొహం మొత్తేశాయి. ముఖ్యంగా ‘సుడిగాడు’తో హై డోస్ కామెడీ అందించాక.. తర్వాతి చిత్రాలు ప్రేక్షకులకు ఆనలేదు. వరుస ఫ్లాపులతో అతను రేసులో వెనుకబడిపోయాడు. పైగా ‘జబర్దస్త్’ కామెడీ షో బుల్లితెరలను ముంచెత్తాక నరేష్ సినిమాలకు విలువ తగ్గిపోయింది. దీంతో అతను కామెడీని వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘మహర్షి’ సినిమాలో సీరియస్‌గా సాగే ప్రత్యేక పాత్ర చేయడంతో పాటు.. ‘నాంది’ సినిమాలో తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన పాత్ర చేసి మెప్పించాడు నరేష్. ఇవి రెండూ బాగానే వర్కవుట్ అయ్యాయి.
‘నాంది’తో అతడి కెరీర్ మలుపు తిరిగినట్లే అనిపించింది. ఇక అక్కడ్నుంచి వరుసగా సీరియస్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు నరేష్. కానీ ‘నాంది’ మ్యాజిక్‌ను ఇంకే సినిమా రిపీట్ చేయలేకపోయింది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం, ఆ ఒక్కటి అడక్కు, బచ్చలమల్లి.. ఇలా నరేష్ నుంచి ఫ్లాపులే వచ్చాయి. వీటిలో ‘ఆ ఒక్కటి అడక్కు’కు కొంచెం కామెడీ టచ్ కూడా ఇచ్చారు. కానీ ఫలితం లేకపోయింది. నాగార్జున మూవీ ‘నా సామిరంగ’లో నరేష్ స్పెషల్ క్యారెక్టర్ చేయగా.. అది ఓ మోస్తరుగా ఆడింది. హీరోగా మాత్రం వరుసగా ఫ్లాపులే వస్తున్నాయి.
తాజాగా నరేష్ ‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది థ్రిల్లర్ మూవీ. ఇందులో నరేష్ పెర్ఫామెన్స్ ఓకే కానీ.. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం నిలబడలేకపోయింది. ఈ చిత్రానికి కనీసం ఓపెనింగ్స్ కూడా లేవు. టాక్ కూడా బ్యాడ్‌గా ఉండడంతో వీకెండ్లోనే సినిమా ప్రభావం చూపలేకపోయింది. నరేష్ ఖాతాలో ఇంకో ఫ్లాప్ జమ అయిందన్నది స్పష్టం. సీరియస్ సినిమాలూ ఆడట్లేదు. కామెడీ కూడా ఫెయిలవుతోంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతున్నాడు నరేష్. మార్కెట్ బాగా దెబ్బ తినేయడంతో ఇకపై ముందులా అవకాశాలు రావడమూ కష్టమేనేమో.