పుష్ప 2 ది రూల్ జాతీయ స్థాయిలో రికార్డుల బద్దలు కొట్టాక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా టైం తీసుకుని దర్శకుడు అట్లీతో తన ఇరవై రెండో సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సెట్స్ పైకి వెళ్లకముందే ఈ మూవీ మీద రకరకాల ప్రచారాలు జరిగాయి కానీ ఎట్టకేలకు వాటికి చెక్ పెడుతూ సక్సెస్ ఫుల్ గా ప్రాజెక్టుని లాంచ్ చేశారు. ఆల్రెడీ ఇరవై శాతం దాకా టాకీ పార్ట్ పూర్తి చేశారని చెన్నై టాక్. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫాంటసీ డ్రామాలో జాన్వీ కపూర్, రష్మిక మందన్న, భాగ్యశ్రీ బోర్సే ఉంటారనే లీక్ తిరుగుతోంది కానీ ఇప్పటికైతే మృణాల్ ఠాకూర్ ఒకటే కీలక షెడ్యూల్స్ లో భాగం పంచుకుంది.
ఇక మ్యూజిక్ పరంగా కొత్త కుర్రాడు సాయి అభ్యంక్కర్ కు అవకాశం ఇవ్వడం తొలుత అభిమానులను ఆశ్చర్యపరిచినా ఆన్ లైన్ లో అతని ట్రాక్ రికార్డు చూసిన ఫ్యాన్స్ ఓకే అనుకున్నారు. ఇప్పుడు అతని నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ రాబట్టుకుని ఎవర్ గ్రీన్ ఆల్బమ్ చేయించుకోవడం దర్శకుడు అట్లీకి సవాల్ కానుందని ఇన్ సైడ్ టాక్. ఎందుకంటే సాయి అభ్యంక్కర్ మొదటి రెండు సినిమాలు రిలీజైపోయాయి. మలయాళం మూవీ బల్టీ, తమిళ సినిమా డ్యూడ్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కంటెంట్ సంగతి పక్కనపెడితే ఈ రెండూ మ్యూజికల్ గా పెద్ద సెన్సేషన్ కాకపోవడం గమనించాల్సిన విషయం.
మ్యూజిక్ లవర్స్ లో సాయి అభ్యంక్కర్ కు అనిరుధ్ రవిచందర్ తో పోలిక వస్తోంది. కానీ ఇతను కొలవెరి డి పాట లాగా సినిమాలకు సంబంధించి ఎలాంటి సెన్సేషనల్ సాంగ్ ఇవ్వలేదు. అలాంటిది ఒకటి పడితే జనాల్లో పేరు నానుతుంది. సాయి నుంచి అలాంటి సంచలనం ఒకటి జరగాలి. డ్యూడ్ లో నిరాశపరచలేదు కానీ మరీ గొప్పగా చెప్పుకునే అవకాశమూ ఇవ్వలేదు. ఇవన్నీ ఓకే కానీ అల్లు అర్జున్ 22కి మాత్రం అతను బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. రాబట్టుకునే బాధ్యత అట్లీ, బన్నీ మీద ఉంటుంది. ఇరవై ఏళ్ళ కుర్రాడు ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీని ఎలా హ్యాండిల్ చేస్తాడోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.