ఎదుటి వారిపై ఒక వేలు చూపించేముందు నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలి. అది వ్యక్తిగతమైనా.. రాజకీయాలైనా అంతే!. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఏపీలో వెలుగు చూసిన నకిలీ మద్యంపై వైసీపీ నాయకులు, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. ఒక ప్రతిపక్షం(ప్రధాన కాదు)గా వైసీపీ ప్రశ్నించడం తప్పుకాదు. కానీ, గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని.. తమది స్వచ్ఛమైన పాలనని కితాబులిచ్చుకుంటున్న నేపథ్యంలో ఆత్మ విమర్శ లేదా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.
నకిలీ మద్యం కేసులో టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని తెలియగానే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను నిర్ద్వంద్వంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి గతంలో న్యూడ్ వీడియో కాల్స్‌తో పట్టుబడిన ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో వైసీపీ ఏం చేసింది? ఇక, తన మాజీ డ్రైవర్‌ను చంపించి(టీడీపీ నేతల వ్యాఖ్యలనుబట్టి).. డోర్ డెలివరీ చేయించి ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో వైసీపీ ఎలా వ్యవహరించింది? అనేది జగన్ మరిచిపోయారు.
అసెంబ్లీలో మెగా స్టార్‌పై బాలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ.. వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఇంకా ఈవిషయాన్ని ప్రజలు వదిలేసినా.. వైసీపీ వదిలేయలేదు. కానీ, అదే సభలో వైసీపీ నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన సతీమణిని అవమానించినప్పుడు.. ఆడు-ఈడు అంటూ.. కొడాలి నాని మాజీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసినప్పుడు.. ఎలాంటి చర్యలు తీసుకున్నారు. కనీసం.. ఇప్పుడు చంద్రబాబు సభలో తమ్ముళ్లను ఘాటుగా హెచ్చరించారు. తర్వాత కూడా అంతర్గతంగా వారికి క్లాస్ ఇచ్చారు. మరి ఈ తరహా సంస్కృతి వైసీపీలో ఉందా?.. జగన్ ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.
కట్టు తప్పుతున్న పోలీసులు.. అంటూ.. నాడు, నేడు హైకోర్టు మందలిస్తూనే ఉంది. అధికారులను కోర్టు మెట్లు ఎక్కిస్తూనే ఉంది. సోమవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు కోర్టుకు రానున్న నేపథ్యంలో వైసీపీ పోలీసులపైనా, చంద్రబాబు పాలనపైనా విమర్శలు చేస్తోంది. అయితే.. ఇదే కొత్తా? వైసీపీ హయాంలో అప్పటి డీజీపీ గౌతం సవాంగ్, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(ఫస్ట్ టైమ్ కోర్టుకు) నీలం సాహ్నిలు కోర్టు మెట్లు ఎక్కలేదా? ఆ సంగతులు మరిచిపోయారా? అప్పట్లో మౌనంగా ఎందుకు ఉన్నారో.. ఆత్మ విమర్శ చేసుకోవాలి జగన్.. అంటున్నారు పరిశీలకులు.