ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ కితాబు లభించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తరచుగా అనేక విషయాలను పంచుకునే ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా నుంచి ఆయన అనూహ్య ప్రశంసలు లభించాయి. చంద్రబాబును ఆయన తిరుగులేని శక్తిగా అభివర్ణించారు. డెవలప్‌మెంటును కలలు కంటుంటారని మహీంద్రా తెలిపారు. ఈవిషయంలో చంద్రబాబుకు అచంచలమైన అంకితభావం ఉందన్నారు. చంద్రబాబు నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది ఇదేనని చెప్పారు.
ఎప్పటికప్పుడు తాను అప్‌డేట్ అవుతూ.. ప్రతి ఒక్కరూ అప్‌డేట్‌గా ఉండాలని చంద్రబాబు కోరుకుంటారని మహీంద్రా తెలిపారు. నూతన విధానాలను అనుసరిస్తారని, ప్రతి ఒక్కరి ప్రమాణాలు పెంచేందుకు చంద్రబాబు దోహద పడతారని పేర్కొన్నారు. ఈ మేరకు మహీంద్ర ఎక్స్‌లో పోస్టు చేశారు. కాగా.. ఇటీవల కాలంలో చంద్రబాబుకు పారిశ్రామిక వేత్తల నుంచే కాకుండా.. ప్రముఖ వ్యక్తుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులోనూ అనేక మంది ఆయన విజన్‌ను ప్రశంసించారు.
ఇక, రాజకీయ నేతల నుంచికూడా పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. పెట్టుబడులు, ఐటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, రాజధాని నిర్మాణం.. ఇలా అనేక విషయాల్లో చంద్రబాబు మార్గదర్శి అంటూ.. ఇటీవల కేంద్ర మంత్రి , మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ప్రశంసలు గుప్పించారు. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ కూడా.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ.. విజన్ ఉన్న నాయకుడు, సుదీర్ఘ అనుభవం ఉన్న నేత ఏపీలో పాలన చేస్తున్నారని కొనియాడారు. ఇక, విదేశీ ప్రముఖులు కూడా ఇటీవల విశాఖ సదస్సులో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు.