పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. వాస్తవానికి ఆయనకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ కింద ఆయనను ఆహ్వానించినా.. స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా పూర్తి చేసుకునేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రెండో రోజు సోమవారం(దీపావళి) పర్యటనలో సాయంత్రం 6-7 గంటల మధ్య ఆస్ట్రేలియాలోని సిడ్నీలో రోడ్ షో నిర్వహించారు.
ఈ రోడ్ షోను.. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. పారిశ్రామిక వేత్తలు.. పెట్టుబడి దారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ రెండు చోట్ల ప్రసంగించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావరణం ఉందని ఆయన తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని.. ఆస్ట్రేలియా పారిశ్రామిక, పెట్టుబడి దారులకు విన్నవించారు. అంతేకాదు.. విశాఖను డెస్టినేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఐటీ హబ్‌గా మారుస్తోందని తెలిపారు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా హబ్‌ను ఏర్పాటు చేస్తోందని, మరిన్ని సంస్థలు కూడా వస్తున్నాయని తెలిపారు. అనుమతుల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదన్న నారా లోకేష్.. కేవలం ఒక్క రోజులోనే అనుమతులు ఇచ్చేలా.. సీఎం చంద్రబాబు చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి విషయాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
విశాఖను వచ్చే నాలుగు సంవత్సరాల్లో ట్రిలియన్ డాలర్ల(88 లక్షల కోట్ల రూపాయలు) కేంద్రంగా మారుస్తున్నామని నారా లోకేష్ వివరించారు. రాష్ట్ర జీడీపీని కూడా పెంచుతున్నామని తెలిపారు. నైపుణ్యం ఉన్న యువత అందుబాటులో ఉన్నారని.. పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వివరించారు. గడిచిన 16 మాసాల్లో 10 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు సాధించామని పారిశ్రామిక వేత్తలకు వివరించారు. కాగా.. నారా లోకేష్‌తో పలు సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. పెట్టుబడులకు ఆసక్తి చూపారు.