వైసీపీ నాయకులకు అధికారం పోయినా.. అధికార దర్పం మాత్రం పోలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అనేక విషయాల్లో వైసిపి నాయకులు ఇంకా తమ తీరు మార్చుకో లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ వైసీపీ నాయకులు మాత్రం తమ తీరులో ఏ మాత్రం మార్పు చూపించలేకపోతున్నారు. అనేక విషయాల్లో ఇప్పటికే నాయకులు కేసుల్లో చిక్కుకుని జైలు పాలయ్యారు. ఒకవైపు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విచారణ జరుగుతుంది. మరోవైపు నకిలీ మద్యం కేసులో నాయకుల తీరుపై చర్చ కొనసాగుతోంది.
అదేవిధంగా క్షేత్రస్థాయిలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండి పార్టీని కాపాడుకోవాల్సింది పోయి వారే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రోజురోజుకు కొత్త కొత్త వివాదాలు సృష్టించుకుంటున్నారు. వీరిలో సీనియర్ నాయకుల నుంచి జూనియర్ నేతల వరకు ఉండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ సృష్టించిన వివాదం పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.
టిడిపి స్థానిక నేత ఒకరు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు కట్టారని ఆరోపించిన పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ్ ఆ ఇంటిని కూల్ చేసేందుకు స్వయంగా బయలుదేరడం తీవ్ర వివాదంగా మారింది. సహజంగా ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడం లేదా ప్రభుత్వానికి రెప్రజెంటేషన్ ఇవ్వడం అనేది సహజం. కానీ, తనే అధికారాన్ని చేతిలోకి తీసుకొని సదరు టిడిపి నేత ఇంటిని కూల్చివేసేందుకు బుల్డోజర్ తో ప్రయత్నం చేయటం పలమనేరు నియోజకవర్గంలో తీవ్ర వివాదానికి దారితీసింది.
ఈ సమయంలో జోక్యం చేసుకున్న పోలీసులను సైతం వెంకట గౌడ దుర్భాషలాడడం మరింత వివాదాన్ని రెచ్చగొట్టేలా చేసింది. దీంతో వెంకట గౌడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే వైసీపీ నాయకుల దూకుడు వల్లే గత ఎన్నికల్లో పార్టీ పరాజయం చెందింది అన్నది వాస్తవం. ఈ విషయాన్ని పార్టీ అధినేత సైతం ఒకానొక దశలో అంగీకరించారు. మీ వల్లే పార్టీ ఓడిపోయిందని ఒకరిద్దరు నాయకుల దగ్గర కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి.
ఇటువంటి సందర్భంలో వచ్చే ఎన్నికలు నాటికి పార్టీ పుంజుకోవాలంటే ఈ తరహా దూకుడు మంచిది కాదన్నది పరిశీలకులు చెబుతున్న మాట. ఏదైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవడం, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, పోలీసులు ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిన నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పార్టీకి మరింత డ్యామేజీ ఏర్పడుతుందని చెబుతున్నారు.