తాజాగా తెలుసు కదాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సిద్ధూ జొన్నలగడ్డకు యునానిమస్ టాక్ రాకపోవడం ఓపెన్ సీక్రెట్. టాక్ మిక్స్డ్ గా ఉందా ఇంకోలా ఉందానేది పక్కనపెడితే డ్యూడ్, కె ర్యాంప్ కన్నా కొంచెం వెనుకబడి ఉండటం ఎవరూ కాదనలేరు. అయితే ఈ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులతో పోస్ట్ రిలీజ్ చిట్ ఛాట్ చేసిన సిద్ధూ చేసిన కామెంట్స్ కొన్ని చర్చకు దారి తీస్తున్నాయి. ఒకరు ఫస్ట్ హాఫ్, మరొకరు సెకండాఫ్ బాగుందని అంటున్నారు, అంటే రెండు సగాలకు కావాల్సిన మెటీరియల్ ఇచ్చాము కాబట్టి ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పేశాడు. సరే ఇక్కడిదాకా ఓకే కానీ మరో ముఖ్యమైన స్టేట్ మెంట్ చూద్దాం.
ఏ సినిమాకైనా సెకండాఫ్ డిప్ ఉంటుందని, పాప్ కార్న్ అమ్మడం కోసం మనోళ్లు పెట్టిన పంచాయితి అని మరో విషయం చెప్పాడు. హాలీవుడ్ లో విశ్రాంతి ఉండదని క్లారిటీ ఇచ్చాడు. సిద్ధూ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు కానీ ఇంగ్లీష్ సినిమాలన్నీ ఇంటర్వెల్ లేకుండా నడవవు. అవి నిర్మాత దర్శకుల నిర్ణయాలని బట్టి బయ్యర్లు పాటిస్తారు. ఇండియన్ మూవీస్ కి బ్రేక్ ఇవ్వడం సర్వ సాధారణం. ఇక డిప్ విషయానికి వస్తే ప్రపంచంలో ప్రతి సినిమా సెకండాఫ్ కు డిప్ ఉంటుందని చెప్పడం మాత్రం కళ్ళు మూసుకుని ఒప్పుకునేది కాదు. ఎందుకంటే తొలి సగం కన్నా రెండో సగం విపరీతమైన కిక్ ఇచ్చిన సినిమాలు బోలెడున్నాయి.
తొలి గంట ఓ మోస్తరుగా సాగే మిరాయ్ లేచి నిలబడింది ఇంటర్వెల్ నుంచే. ప్రీ క్లైమాక్స్ నుంచి దాన్ని పీక్స్ కు తీసుకెళ్లారు. విక్రమార్కుడులో విక్రమ్ సింగ్ రాథోడ్ విశ్వరూపం చూపించేది ఏ భాగంలోనో చెప్పాల్సిన పని లేదు. మగధీరలో గూస్ బంప్స్ ఇచ్చే కంటెంట్ అంతా సెకండాఫ్ లో ఉంటుంది. డీజే టిల్లులో ట్విస్టులు ఎక్కువ వచ్చేది ఎక్కడో ఫ్యాన్స్ ని అడిగితే ఠక్కున చెప్తారు. ఇక ఇంటర్వెల్ విషయానికి వస్తే అది స్నాక్స్ అమ్మడానికి మాత్రమే కాదు. ప్రేక్షకుల ప్రకృతి ధర్మాన్ని గౌరవించడం కోసం. ఇందులో నిజమెంతుందో అర్థం కావాలంటే ఏ థియేటర్ ఇంటర్వెల్ లో అయినా జస్ట్ వాష్ రూమ్ మీద ఒక లుక్ వేసి వస్తే చాలు.
సినిమా జరుగుతున్నప్పుడు చాలా మంది బయటికి వెళ్లేందుకు ఇష్టపడరు. అటెన్షన్ పోతుందనో లేదా ఒక మంచి సాంగ్ లేదా సీన్ మిస్సవుతుందనో సీట్లోనే ఉంటారు. బ్రేక్ ఇచ్చాకే బయటికి వస్తారు. మల్టీప్లెక్సుల్లో అసలేమీ కొనకుండా ఉండే వాళ్ళు వందల్లో కాదు వేలల్లో ఉంటారు. వీళ్ళ నేచర్ కాల్ కోసమే విశ్రాంతి ఇస్తారు. డిప్ ప్రతి సినిమాలోనూ ఉంటుంది నిజమే. కానీ అది వచ్చినప్పుడు వెంటనే దాన్ని మర్చిపోయేలా స్క్రీన్ ప్లే మేజిక్ చేయగలిగినప్పుడే కదా మణిరత్నం, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, సుకుమార్ లాంటి మేకర్స్ పుట్టుకొస్తారు. డౌట్ ఉంటే వీళ్ళ బ్లాక్ బస్టర్స్ మరోసారి కేవలం సెకండాఫ్ చూస్తే క్లారిటీ వస్తుంది.
#SiddhuJonnalagadda:“Second Half ప్రతి సినిమాలో Dip ఉంటది… ఇది Interval అనే Concept వల్ల జరిగింది.Hollywood లో Interval ఉండదు. ఇది మనోళ్లు Popcorn అమ్ముకోవడానికి చేసిన పంచాయితీ.”Full Interview: https://t.co/EpNF1Eve31#TelusuKada pic.twitter.com/9YLosnWeVx— Gulte (@GulteOfficial) October 19, 2025