దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా దరిద్రపుగొట్టు రికార్డు ఏపీ సొంతం. విభజన నేపథ్యంలో అటు ఇటు కాకుండా పోయిన ఏపీకి ఎప్పటికి రాజధాని సమకూరుతుందన్న ప్రశ్న సగటు ఆంధ్రోడ్ని వెంటాడి వేధిస్తోంది. నిజానికి రాజధాని అంశంపై జగన్ సర్కారు వ్యవహరించిన తీరు.. ఆ పార్టీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడిన మాటలు ఆ పార్టీని దారుణంగా దెబ్బ తీశాయి. 2019 ఎన్నికలకు ముందు అమరావతిని కంటిన్యూ చేస్తామని చెప్పిన జగన్.. తాను ముఖ్యమంత్రి అయ్యాక రాజధానిపై స్టాండ్ మార్చుకోవటం.. అమరావతితో పాటు మరో రెండు రాజధానుల్ని తెర మీదకు తీసుకురావటం.. తాను అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రాజధాని మీద ముందడుగు పడింది లేదు.
గతాన్ని గుర్తు చేసుకుంటే..జగన్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. తొలుత రోడ్డు ఎక్కింది అమరావతి రైతులే. నిజానికి జగన్ సర్కారుపై వ్యతిరేకత పెరిగటంతో అమరావతి రైతుల పోరు కూడా ఒక కారణంగా చెబుతారు. రాజధానిపై జగన్ అండ్ కో వ్యవహరించిన తీరు ఇప్పటికి మార్పు రాకపోవటం విస్మయానికి గురి చేసే అంశంగా చెప్పాలి. సాధారణంగా తప్పుల నుంచి అంతో ఇంతో నేర్చుకోవటం ఉంటుంది. వైసీపీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి.
తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఏపీ రాజధానిపై వైసీపీ ఆలోచన ఏంటి? ఎలాంటి రాజధాని అవసరమని భావిస్తున్నారు? రాజధానిపై విజన్ ఏంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికి లభించని పరిస్థితి. తాజాగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ కంటే పెద్ద రాజధాని మనకెందుకు? అంటూ ప్రశ్నించిన తీరు చూస్తే.. రాజధానిపై వైసీపీ ఇప్పటికి కచ్ఛితమైన ఆలోచన లేదన్న భావన కలగటం ఖాయం.
‘‘మా ఖర్మ కాకుంటే ఢిల్లీ కంటే పెద్ద రాజధాని మనకెందుకు? ఏంటి మనకు అంత గొప్ప? అసలు నాకు అర్థం కావట్లేదు. సింగపూర్.. యూకే.. లండన్ లాంటి రాజధాని మనకు ఎందుకు? ఏం చేసుకుంటాం’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నంతనే.. ఆయనకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.
ఉన్నత చదువుల కోసం.. ఉద్యోగాల కోసం దేశాన్నివిడిచి అమెరికాతో పాటు ప్రాశ్చాత్య దేశాలకు వెళ్లటం తెలిసిందే. మనకు గొప్ప రాజధాని.. పెద్ద రాజధాని వద్దని భావించే అంబటి.. తన పిల్లల్ని విదేశాలకు ఎందుకు పంపినట్లు? ఉన్నత చదువులు చదివించటం ఎందుకు? ఆయన ప్రాతినిధ్యం వహించిన సత్తెన పల్లిలోనో.. ఇంకే ప్రాంతానికో పరిమితమై.. ఏదో చిన్నా చితకా పనులు చేసుకుంటూ ఉండిపోతే సరిపోతుంది కదా?
అవేమీ కాకుండా తనకు మించిన చదువు.. తనకు మించిన జీవనశైలి తన పిల్లలకు ఉండాలని తపించిన అంబటి మాదిరే.. మిగిలిన రాజధానుల కంటే మించిన రాజధానిని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో తప్పేంటి? అన్నది ప్రశ్న. పిల్లల విషయంలో ఏ తండ్రి అయినా.. తమకంటే మిన్నగా ఉండాలని భావిస్తారు. అలానే.. రాజధాని లేని రాష్ట్రానికి ఇన్నాళ్లకు ఒక రాజధాని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు భారీగా ఏర్పాటు చేయాలని భావించటం తప్పెందుకు అవుతుంది.
మరి కాస్తా అర్థం కావాలంటే.. ఎవరైనా.. ఏ స్థాయిలో ఉన్నోళ్లు అయినా సొంత ఇంటిని ఏర్పాటు చేసుకునే వేళలో.. అప్పు చేసి మరీ ఇంటిని ఎందుకు కొనుగోలు చేయాలి? తమ స్థాయికి మించి ఎందుకు ఖర్చు చేస్తారు? ఒక కుటుంబానికి సొంతిల్లు ఎలా అవసరమో.. అలానే ఒక రాష్ట్రానికి రాజధాని నగరం భారీగా.. మిగిలిన వాటికి మించినట్లు ఉండాలనుకోవటం తప్పెందుకు అవుతుంది? రాజకీయంగా చంద్రబాబును తప్పు పట్టాలన్నా.. ఆయన నిర్ణయాలు బాగోకున్నా.. పాలన సరిగా లేకున్నా.. వాటిని వేలెత్తి చూపించటం తప్పేం కాదు. కానీ.. రాజధానిపై మాట్లాడేటప్పుదు బాధ్యతగా మాట్లాడటం అవసరమన్నది అంబటి ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.