ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో పలకరించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందులో ‘హరిహర వీరమల్లు’ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసినా.. ‘ఓజీ’ తమ ఆకలి తీర్చడం, బాక్సాఫీస్ దగ్గర కూడా బాగా ఆడడంతో వాళ్లు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక పవన్ చేతిలో ఉన్నది ఒక్కటే సినిమా. అదే.. ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు సంబంధించి పవన్ తన షూటింగ్ పార్ట్ అంతా గత నెలలోనే పూర్తి చేసేశాడు.
దీంతో ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగానే ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తారేమో అనుకున్నారు అభిమానులు. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో పవన్ గత చిత్రాలకు భిన్నంగా జరుగుతోంది. హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలకు మిగతా నటీనటుల షూటింగ్ పార్ట్ అంతా పూర్తి చేసి పవన్ కోసం ఎదురు చూశారు. పవన్ పని పూర్తవ్వగానే సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయి.
కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అలా కాదు. ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలను పూర్తి చేసి పవన్ అందుబాటులోకి రాగానే.. ఆయనతో ముడిపడ్డ సన్నివేశాలు వరుసబెట్టి తీయడం మొదలుపెట్టారు. నెల రోజుల కాల్ షీట్స్‌తో పాటలు సహా అన్నీ అవగొట్టేశాడు హరీష్ శంకర్. ఆయన పాత్ర వరకు టీం గుమ్మడికాయ కొట్టేసింది. కానీ ఆయనతో సంబంధం లేకుండా ఇంకా తీయాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయట.
ఈ సినిమాకు సంబంధించి ఇంకా 25 రోజుల షూటింగ్ మిగిలి ఉందని నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. అవి పూర్తయ్యాకే విడుదల గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు. ఇంకా ‘ఉస్తాద్’ రిలీజ్ డేట్ గురించి తాము ఏమీ అనుకోలేదని రవిశంకర్ తెలిపారు. ఈ ఏడాదిలో అయితే సినిమా విడుదలకు సిద్ధమయ్యే పరిస్థితి లేదు. సంక్రాంతికి అస్సలు ఖాళీ లేదు. కాబట్టి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందన్నమాట.