సలార్ తో మనకు పరిచయమైనప్పటికి ఇప్పుడు మహేష్ బాబు వారణాసి విలన్ గా నటిస్తున్న మలయాళం స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ దీని ద్వారా మరింత చేరువ కాబోతున్నాడు. ముందు నుంచి తెలుగు మార్కెట్ మీద పట్టు సాధించాలని ట్రై చేస్తున్న ఈ విలక్షణ నటుడికి డబ్బింగు సినిమాల విషయంలో లక్కు కలిసి రావడం లేదు. తాజాగా ఈయన కొత్త మూవీ విలయత్ బుద్దా చెప్పుకోదగ్గ అంచనాలతో కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. పుష్ప పోలికలు పుష్కలంగా ఉన్నాయని టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. పబ్లిక్ టాక్ అధిక శాతం నెగటివ్ గా ఉంది.
తక్కువ బడ్జెట్ తో అడవి నేపథ్యంలో చిన్న సినిమాగా వచ్చిన ఎకో మల్లువుడ్ లో దూసుకుపోతుండగా విలయత్ బుద్దా మాత్రం కనీసం యావరేజ్ అనిపించుకోలేక ఆపసోపాలు పడుతోంది. దీనికైన బడ్జెట్ సుమారు 40 కోట్లు కాగా ఓవరాల్ కలెక్షన్ 10 కోట్లు దాటితే గొప్పేనని ట్రేడ్ అంచనా. అంటే పట్టుమని పాతిక శాతం రికవరీ కూడా లేదన్న మాట. దర్శకుడిగా ఎల్ 2 ఎంపురాన్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పృథ్విరాజ్ కు ఈ పరిణామం ఏ మాత్రం మింగుడు పడటం లేదు. మూడు గంటలకు దగ్గరగా ఉన్న నిడివి, నెమ్మదిగా సాగే సన్నివేశాలు, రొటీన్ కంటెంట్ వెరసి విలయత్ బుద్దాని ఫ్లాప్ చేసేలా ఉన్నాయి.
అన్నట్టు దీని తెలుగు వెర్షన్ కూడా సిద్ధం చేశారు. ఒరిజినల్ లోనే అంత నీరసంగా ఆడితే మన దగ్గర వసూళ్లు దక్కించుకోవడం కష్టం. చాలా ఆలస్యంగా వాయిదాలు పడుతూ వచ్చిన విలయత్ బుద్ధ ఒక రిటైర్డ్ టీచర్, స్మగ్లర్ గా మారిన అతని స్టూడెంట్ కి మధ్య ఈగో వార్ గా రూపొందింది. అడవులు, ఎర్ర చందనం స్మగ్లింగ్ లాంటి ఎలిమెంట్స్ పుష్పా తరహాలోనే ఉంటాయి. కానీ సుకుమార్ అంత ఎంగేజింగ్ గా చెప్పడంలో దర్శకుడు తీవ్రంగా తడబడ్డాడు. ఇదంతా ఎలా ఉన్నా వారణాసి మీద పృథ్విరాజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. వరల్డ్ వైడ్ గుర్తింపుకి ఇది పెద్ద మెట్టుగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాడు.