“నేను కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నా. కానీ ఎక్కడా కుంగిపోలేదు. ధైర్యంగా నిలబడ్డాను. పోరాటం చేశాను. మనం కుంగిపోతే మనపై మరింత మంది రెచ్చిపోతారు. అప్పుడు మన ఉనికికే ప్రమాదం సంభవిస్తుంది.” అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. తాజాగా విజయవాడలో జరిగిన విలువల విద్య పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రముఖ ప్రవచణ కర్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు రచించిన ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలోనే పంపిణీ చేయనున్నారు. ఈ పుస్తకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పరీక్షల్లో తప్పామన్న అవమానంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని కానీ ఇది సరికాదన్నారు. ఒక పరీక్ష తప్పితే మరోసారి రాసుకుని విజయం దక్కించుకోవచ్చని ఆత్మహత్య చేసుకుంటే మళ్లీ జీవితం తిరిగి రాదని అన్నారు. తాను కూడా జీవితంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. తొలిసారి మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు తాను ఓడిపోయానని అలాగని రాజకీయాలకు దూరమయ్యానా అని ప్రశ్నించారు. అంతేకాదు అదే నియోజకవర్గం నుంచి పట్టుబట్టి విజయం దక్కించుకున్నానన్నారు.
ఇక రాజకీయంగా కూడా తనకు అనేక ఎదురు దెబ్బలు తగిలాయని చెప్పారు. అడుగడుగునా తాను అవమానాలు ఎదుర్కొన్నానన్నారు. బాడీ షేమింగ్ కూడా చేశారని తాను ఏం మాట్లాడినా తప్పుగా ప్రచారం చేశారని చెప్పారు. అయినా వాటిని తట్టుకుని నిలబడి ఇప్పుడు మంత్రిగా మీ ముందుకు వచ్చానని లోకేష్ చెప్పారు. అవమానాలు, వేధింపులు తట్టుకుని నిలబడినప్పుడే జీవితంలో పైకి వచ్చేందుకు అవకాశంగా మార్చుకున్నప్పుడే విజేతలు అవుతారని ఏ విజయమూ వడ్డించిన విస్తరి కాదని తెలిపారు. విద్యార్థులు కూడా ఒకసారి తప్పితేనో ఇంట్లో పరిస్థితులు సరిగా లేవనో ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిపారు.
బలంగా నిలబడి ప్రభుత్వం అందిస్తున్న సాయంతో ఎదగాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరినీ గౌరవించాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో విద్యార్థులు మరింత గౌరవంగా ఉండాలన్నారు. ఇక ఉపాధ్యాయులు కూడా పిల్లలను తమ వారిగా భావించి తీర్చిదిద్దాలని మంత్రి లోకేష్ సూచించారు. వారి సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించామన్నారు. ఇతర సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే వాటిని కూడా పరిష్కరించనున్నట్టు మంత్రి చెప్పారు.