hyderabadupdates.com movies ఎన్నికల్లో సెంటిమెంటు లెక్క‌లు మారాయా?

ఎన్నికల్లో సెంటిమెంటు లెక్క‌లు మారాయా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో ఫ‌లితం కాంగ్రెస్‌కు అనుకూలంగా వ‌చ్చింది. వాస్త‌వానికి ఇక్క‌డ పార్టీల కంటే కూడా.. సెంటిమెంటుకు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఉంటుంద‌న్న చ‌ర్చ సాగింది. ముఖ్యంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ నుంచి మూడు ర‌కాల సెంటిమెంట్లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ వైపు నుంచి కూడా రెండు ర‌కాల సెంటిమెంటు రాజ‌కీయాలు సాగాయి. అయితే.. ఈసెంటిమెంటు రాజ‌కీయాలు ఏమ‌య్యాయి? ప్ర‌ధానంగా బీఆర్ ఎస్కు అనుకూలంగా ఉంటుంద‌న్న సెంటిమెంటు ఏమైపోయింది? అనే చ‌ర్చ ఆస‌క్తిగా మారింది.

బీఆర్ ఎస్ త‌ర‌ఫున పోటీ చేసిన మాగంటి సునీత‌.. ప్ర‌ధానంగా త‌న భర్త మాగంటి గోపీనాథ్ మ‌ర‌ణంతో వ‌చ్చిన ఉప పోరుకావ‌డంతో త‌మ‌కు అనుకూలంగా ఉంటుందని భావించారు. ఆయ‌న‌ఫొటోలు ప‌ట్టుకుని ప్ర‌చారం చేశారు. తొలిరోజు స‌భ పెట్టిన‌ప్పుడు.. క‌న్నీరు కూడా పెట్టుకున్నారు. ఇక‌, రెండో సెంటిమెంటు.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పాల‌న‌.. అప్ప‌ట్లో ఇచ్చిన సంక్షేమాన్ని ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌చారం చేశారు. ఇది త‌మ‌కు సెంటిమెంటును పండిస్తుంద‌ని భావించారు. మూడో సెంటిమెంటు.. మాగంటి కుటుంబానికి ఉన్న వ్య‌వ‌స్థాగ‌త ఓటు బ్యాంకు.

ఇలా మూడు ర‌కాల సెంటిమెంట్ల‌ను బీఆర్ ఎస్ పార్టీ న‌మ్ముకుంది. కానీ, ఇది పెద్ద‌గా ఫ‌లించ‌లేదు. కానీ, ప్ర‌భావం చూపించింది. అందుకే ప్ర‌తి రౌండ్‌లోనూ వెనుక‌బడిన‌ప్ప‌టికీ.. మాగంటి సునీత గ‌ట్టి పోటీనే ఇచ్చార‌ని చెప్పాలి. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ కూడా రెండు ర‌కాల సెంటిమెంట్ల‌ను ప్ర‌యోగించింది. 1) కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, ఆర్టీసీ ఉచిత ప్ర‌యాణం. అయితే.. ఇదేస‌మ‌యంలో అమ‌లు చేయ‌ని గ్యారెంటీల విష‌యంలో ప్ర‌జ‌ల నుంచిప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. అయినా.. ముందుకు సాగారు. ఇక‌, రెండో సెంటిమెంటు.. న‌వీన్ యాద‌వ్ వ‌రుస ప‌రాజ‌యాలు.

2014 నుంచి వ‌ర‌స‌గా ఆయ‌న పోటీ చేసిన‌ప్ప‌టికీ.. ఓడిపోయారు. ఈ విష‌యాన్ని జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు వివ‌రించ‌డంలో న‌వీన్ స‌క్సెస్ అయ్యారు. దీంతో ఈ సెంటిమెంటు బాగా క‌లిసివ‌చ్చింద‌న్న చ‌ర్చ సాగుతోంది. దీనికితోడు చివ‌రి మూడురోజులు.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన మంత్రాంగం.. బ‌ల‌మైన వాగ్యుద్ధం.. అదేవిధంగా క‌లిసి వ‌చ్చిన మంత్రులు.. న‌వీన్ విజ‌యానికి కార‌ణంగా మారిన‌ట్టు అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో బీఆర్ ఎస్‌నాయ‌కురాలు.. సునీత కుటుంబ వ్య‌వ‌హారం.. ఆమె అంత్త‌గారు మాగంటి మ‌హాదేవి చేసిన వ్యాఖ్యాలు.. ఆమెకు ప‌రాజ‌యాన్ని తీసుకువ‌చ్చాయ‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.

Related Post