ఎనిమిది గంటల సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత సాధారణంగా ఎవరైనా అలసిపోవడం సహజం. ఎంత విమానంలో ప్రయాణించినా అలుపు సొలుపు అనేది కచ్చితంగా వస్తుంది. వెంటనే విశ్రాంతి మందిరాలకు వెళ్తారు. ఒక గంట, రెండు గంటలు రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది సహజంగా జరిగేది. కానీ, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం 75 ఏళ్ల వయసులో కూడా నవయువకుడిలాగా వ్యవహరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధాన చర్చగా, ఆసక్తిగా కూడా మారింది.
సీఎం చంద్రబాబు తాజాగా బుధవారం హైదరాబాద్ నుంచి దుబాయ్ పర్యటనకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. దీనికి ముందు ఆయన విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ రెండు కార్యక్రమాలకి ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా భీమవరం లో జరిగిన డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై డీజీపీ, అలాగే హోంమంత్రి అనితతో ఆయన చర్చలు జరిపారు. ఇది ముగిసిన వెంటనే అటునుంచే కారెక్కి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దుబాయ్ కి బయలుదేరారు. ఈ మొత్తం ప్రయాణం సుమారు ఎనిమిది గంటలకు పైగానే పట్టిందనేది అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఇంత శ్రమ తీసుకున్న తర్వాత సహజంగా ఒక ఐదు నిమిషాలైనా, పది నిమిషాలైనా కనీసం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏ వ్యక్తికైనా ఉంటుంది. కానీ, ఈ విషయంలో సీఎం చంద్రబాబు అసలు ఎక్కడా రెస్ట్ లేకుండా విమానంలోనే తనతో పాటు దుబాయ్ కి ప్రయాణం చేసిన మంత్రులు టీజీ భరత్, అలాగే బీసీ జనార్దన్ రెడ్డిలతో చర్చలు జరిపారు.
విమానంలో నుంచే ఆయన అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఆయనతో ఉన్న అధికారులను ఆయన కొన్ని విషయాలపై బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. అనంతరం దుబాయ్ కి చేరుకున్న వెంటనే చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించడం, ఆయనను ఆహ్వానించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరితో సెల్ఫీలు తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్కడ అలసట అన్న ఛాయలు కూడా ఆయన ముఖంలో కనిపించలేదు.
అంతేకాదు, ఆ వెంటనే విమానాశ్రయం నుంచి నేరుగా ఒక హోటల్‌కు చేరుకున్నారు. పెట్టుబడిదారులతో చర్చలు జరిపారు. ఇవి సుదీర్ఘంగా మరో నాలుగు గంటల పాటు సాగాయి. రాష్ట్రానికి పెట్టుబడులు కోసం ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు పెట్టుకున్నారు. ఇది అందరికీ తెలిసిందే.
అయితే ఇంత బిజీ షెడ్యూల్ ను ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఎక్కడా అలసట లేని జీవితాన్ని ఆయన ఎలా నెట్టుకొస్తున్నారు అన్నది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతంలో వైసిపి అధినేత జగన్ కూడా దుబాయ్ పర్యటనకు వెళ్లారు. పెట్టుబడుల కోసం ఆ దేశంలో పర్యటించారు. కానీ, జగన్ విమానం ప్రయాణం చేసిన తర్వాత ఆ రోజు అక్కడ రెస్ట్ తీసుకొని తెల్లవారికి పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. ఈ వార్తలు అప్పట్లోనే వచ్చాయి.
ఆయనతో పోల్చుకున్నప్పుడు చంద్రబాబులో ఇంత స్టామినా ఎక్కడ నుంచి వస్తోంది? ఎలా పనిచేస్తున్నారు అన్నదే సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ. మరి దీనిపై చంద్రబాబు ఏమంటారు అనేది చూడాలి. దీనిని టిడిపి నాయకులు అయితే స్వాగతిస్తున్నారు. 75 ఏళ్ల వయసులో ఉన్న 25 ఏళ్ల యువకుడు అని వారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.