hyderabadupdates.com movies ఏపీలో 120 చోట్ల ఏసీబీ దాడులు.. డబ్బును బయటకు విసిరేశారు!

ఏపీలో 120 చోట్ల ఏసీబీ దాడులు.. డబ్బును బయటకు విసిరేశారు!

ఏపీలోని 120 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. అధికారుల సోదాలతో అప్రమత్తం అయిన డాక్యుమెంట్ రైటర్లు తమ షాపులకు తాళం వేసుకొని పరారయ్యారు. ఒంగోలు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుపై ఏసీబీ దాడులు చేసిన సమయంలో కార్యాలయ సిబ్బంది భయంతో డబ్బులను బయటకు విసిరి వేసినట్టు సమాచారం. సిబ్బంది విసిరేసిన సుమారు రూ.30 వేలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ దాడులు చేపట్టింది. ఏసీబీ అధికారులు రాగానే డాక్యుమెంట్ రైటర్లు వెళ్లిపోయారు. కీలక దస్త్రాలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో బయట వ్యక్తులు లోపలికి రాకుండా తలుపులు వేసి తనిఖీలు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయానికి తాళలు వేసి లోపల దస్త్రాలను పరిశీలించారు.

ఇక్కడ దస్తావేజు రైటర్లకు, రిజిస్టర్లకు మధ్య పెద్దఎత్తున లావాదేవీలు నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రార్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్న షాప్ లు మొత్తం వ్యాపారులు మూసివేశారు. విశాఖలోని ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారి నేతృత్వంలో రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరుతో పాటు పలు జిల్లాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు చేపట్టింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై వచ్చిన ఫిర్యాదులతో ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే సాధారణ తనిఖీల్లో భాగంగానే తా ము వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

Related Post