ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చేసిన నేపథ్యంలో దీనికి చట్టబద్ధత కలిగింది. అయితే.. ఇక నుంచి అమరావతిని ప్రత్యేకంగా చూడడంతోపాటు..ఇక్కడ అన్ని విషయాలపైనా కీలక ముందడుగు పడేలా సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా అమరావతికి పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అదేసమయంలో అమరావతికి ప్రత్యేకమైన పాలనా వ్యవస్థ ఉండేలా కూడా కీలక చర్యలు తీసుకుంటున్నారు.
అదేసమయంలో అమరావతి స్వయం ఉపాధి కేంద్రంగా మారేలా కూడా.. ఆయన చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా.. అమరావతి పాలనాపరమైన వ్యవస్థీకృత ఏర్పాట్ల కోసం సమగ్ర నివేదిక తయారు చేసేందుకు సంస్థలను ఆహ్వానిస్తున్నారు. దీనిపై అధ్యయనం చేయడంతోపాటు.. ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా భద్రత, ఇక్కడి భూముల సమగ్ర వినియోగం, ప్రత్యేక మునిసిపల్ చట్టాలను రూపొందించనున్నారు.
ఈ మేరకు తాజాగా ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతిలో ఏర్పాటు చేసే టోల్ గేట్ల నుంచి ఇతర సదుపాయాల వరకు.. ఫీజుల వసూలు, అక్రమాలు, అవినీతి, అనధికారిక నిర్మాణాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ టెండర్లలో పేర్కొన్న అంశాల మేరకు.. రాజధాని భవిష్యత్‌లో స్వయంపాలిత ప్రాంతంగా మారుతుంది. ఆర్థిక వనరుల నిర్వహణ, యూజర్‌ఛార్జీలు, డెవలప్‌మెంట్ ఛార్జీల వసూలుకు ప్రత్యేక నిబంధనలు రూపొందించనున్నారు.
తద్వారా.. అమరావతికి సొమ్ములు చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అమరావతిలో పరిపాలన కోసం ఒక అపెక్స్‌బాడీ(స్వయం నిర్ణయాధికారులు ఉంటాయి) ఏర్పాటుకు వీలుగా ప్రస్తుత పట్టణాభివృద్ధిశాఖ చట్టాల్లో మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా మెట్రోపాలిటన్ ప్లానింగ్ వర్తించేలా మార్పులు చేస్తారు. అదేసమయంలో అమరావతిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తే పరిపాలన ఎలా ఉండాలనే అంశం మీద విధి విధానాలు తయారు చేయనున్నారు. భూఆదాయ వివరాలను ఎలా ఉండాలనే అంశాన్ని కూడా టెండర్లలో పేర్కొన్నారు.