ఏపీ ముఖ్యమంత్రిగా నిత్యం బిజీగా ఉంటున్న చంద్రబాబు, విపక్ష(ప్రధాన కాదు) నేతగా, మాజీ ముఖ్య మంత్రిగా ఉన్న వైసీపీ అధినేత జగన్.. దీపావళి వేళ సతీమణులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. అయితే.. ఇరువురు కలిసికాదు.. వేర్వేరుగానే సుమా!. చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఉండవల్లిలోని నివాసంలో, మాజీ సీఎం జగన్.. తన సతీమణి భారతితో కలిసి బెంగళూరులోని నివాసంలో దీపావళి పండుగను నిర్వహించుకున్నారు.
ఇక, సీఎం చంద్రబాబు పండుగైనా.. మరే కార్యక్రమమైనా.. పార్టీ జెండా రంగు లైట్ పసుపు వర్ణంలోని చొక్కాను ధరించగా.. ఆయన సతీమణి భువనేశ్వరి మాత్రం పట్టుచీర ధరించారు. ఇక, జగన్ వైట్ షర్టే ధరించినా.. కాస్త భిన్నంగా లాల్చీ టైపులో కుట్టించుకున్నారు. బ్లాక్ కలర్ ఫ్యాంటు, షూస్ ధరించారు. ఆయన సతీమణి భారతి వంగపండు రంగు పంజాబీ డ్రస్ ధరించారు. ఇలా.. దీపావళి వేళ ఇరు కుటుంబాలు సంతోషంగా పండుగను నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా.. చంద్రబాబు సతీమణి, జగన్ సతీమణి.. ఇద్దరూ తమ తమ భర్తలకు జాగ్రత్తలు చెప్పడం విశేషం. చంద్రబాబు చిచ్చుబుడ్డి వెలిగిస్తుండగా.. వెనుకాల ఉన్న భువనేశ్వరి… `ఏవండీ జాగ్రత్త` అంటూ .. జాగ్రత్తలు చెప్పారు. “ఆ..“ అని ఓ నవ్వు నవ్విన చంద్రబాబు.. ధైర్యంగా ముందుకు సాగి.. చిచ్చుబుడ్డే కాదు.. సీమ టపాకాయలు కూడా వెలిగించారు. ఇక, జగన్ సతీమణి భారతి కాకరపువ్వత్తులకు పరిమితం కాగా.. జగన్ తనకు ఇష్టమైన తారాజువ్వలను వడుపుగా నింగిలోకి పంపించారు.
గత సంవత్సరం ఇరు కుటుంబాలు దీపావళికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు.. పొదుపు పేరుతో ఈ పండుగకు దూరంగా ఉన్నారు. కానీ, జగన్ మాత్రం ఓటమి బాధతో పండుగను నిర్వహించుకోకుండా మౌనంగా ఉండిపోయారు. ఇక ఇరు కుటుంబాల్లోని పిల్లలు తాజా పండుగలోనూ కనిపించకపోవడం గమనార్హం. నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా, జగన్ పిల్లలు ఇద్దరూ లండన్‌లోనే ఉన్నారు. దీంతో దంపతులే దీపావళిని నిర్వహించుకున్నారు.