తమ పెట్టుబడులను, కంపెనీలను ఏపీ ఎగరేసుకుపోతోందని కర్ణాటక ప్రభుత్వం వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏమనుకున్నా.. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకునేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య పోటీ ఉంటేనే పెట్టుబడులకు, పెట్టుబడి దారులకు అవకాశాలు మెరుగు అవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటక పేరుఎత్తకుండానే.. ఆ రాష్ట్రంపై వ్యాఖ్యలు చేశారు. కీచులాడుకుంటేనో.. సౌకర్యాలు మెరుగు పరచకుంటేనో.. పెట్టుబడులు రాబోవని తెలిపారు. పెట్టుబడి దారులు కూడా తమకు మేలైన సౌకర్యాలు కల్పించే రాష్ట్రాలను ఎంచుకుంటున్నాయన్నారు.
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న నారా లోకేష్ ఇక్కడి ప్రవాసాంధ్రులతో ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పెట్టుబడులు పెట్టేవారికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు అత్యంత వేగంగా మంజూరు చేస్తున్నామని తెలిపారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయని..కానీ.. ఏపీలో మాత్రం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందన్నారు. 16 మాసాల్లోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చామని.. అదేవిధంగా కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు సహకారంతో గూగుల్ డేటా కేంద్రాన్ని తీసుకువచ్చామని వివరించారు.
పోలవరం, అమరావతి సహా కీలకమైన అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని లోకేష్ తెలిపారు. అదే సమయంలో పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని.. ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకునేది లేదని స్పష్టం చేశారు. పెట్టుబడుల సాధనలో చంద్రబాబు ఐకాన్‌గా నిలుస్తున్నారని.. 75 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్లయువకుడిగా ఆయన వ్యవహరిస్తున్నారని తెలిపారు. అదేసమయంలో రాష్ట్రంలోని కూటమి సర్కారు కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. డిప్యూటీసీఎంపవన్ కల్యాణ్ సహకారంతో ఇవన్నీ సాకారం అవుతున్నాయని తెలిపారు.