గత కొన్ని వారాలుగా ‘ఐ బొమ్మ’ రవి వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ఓటీటీల్లోకి వచ్చే కొత్త తెలుగు చిత్రాలను పైరసీ చేసి ‘ఐబొమ్మ’ అనే పైరసీ వెబ్ సైట్ ద్వారా రిలీజ్ చేయడంతో మొదలుపెట్టి.. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల సర్వర్లను హ్యాక్ చేయడం ద్వారా కొత్త సినిమా ఇంకా బిగ్ స్క్రీన్లలోకి కూడా రాకముందే లీక్ చేసే ప్రమాదకర స్థాయికి అతను చేరాడు.
దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాలు విసిరే స్థాయికి అతడి కాన్ఫిడెన్స్ వెళ్లిపోయింది. కానీ ఆ ఛాలెంజే అతడి కొంప ముంచింది. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన అతణ్ని పోలీసులు పట్టుకుని అనేక కేసులు పెట్టి విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఎప్పటికప్పుడు అనేక విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా అతను ఐబొమ్మ, బప్పం అనే పేర్ల వెనుక కథను పోలీసులకు వెల్లడించాడట.
తనది వైజాగ్ అని.. అక్కడ కొత్త సినిమా షో మొదలవ్వగానే బొమ్మ పడింది అని మాట్లాడుకునేవారని.. దాన్ని దృష్టిలో ఉంచుకుని ‘ఐ బొమ్మ’ అనే పేరుతో వెబ్ సైట్ మొదలుపెట్టానని రవి చెప్పాడట. ‘ఐ బొమ్మ’ అంటే.. ‘నా బొమ్మ’ అని అర్థమని.. తన థియేటర్లో తాను ప్రదర్శించే బొమ్మ అనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టానని రవి తెలిపాడట. ఇక ‘ఐ బొమ్మ’ మీద పోలీసుల ఫోకస్ పెరగడంతో అతను ‘బప్పం టీవీ’ అని ప్రత్యామ్నాయంగా ఇంకో సైట్‌ను తీసుకొచ్చాడు. ఇక్కడ ‘బప్పం’ అంటే సుప్రీం అని అర్థమట. తాను సుప్రీం అని చెప్పడానికే ఈ పేరుతో సైట్ పెట్టినట్లు రవి వెల్లడించాడట.
ఇక విజయ్ దేవరకొండ సినిమా ‘ఖుషి’ రిలీజ్ టైంలో హీరో టీం తన మీద ఫోకస్ పెట్టడంతో వాళ్లకు సవాలు విసరడం గురించి.. ‘కింగ్డమ్’ సినిమాను పనిగట్టుకుని పైరసీ చేయడం గురించి కూడా అతను కొన్ని విషయాలు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా విచారణలో అనేక విషయాలు వెల్లడిస్తున్న రవి.. తాను తప్పు చేశానని.. ఈసారికి విడిచిపెడితే ఇకపై పైరసీ జోలికే వెళ్లకుండా వేరే పని చేసుకుని బతుకుతానని పోలీసుల కాళ్ల మీద పడ్డట్లు చెబుతున్నారు.