మొన్న ఏప్రిల్ కే రావాల్సిన ది రాజా సాబ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఫైనల్ గా జనవరి 9 లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్నా ఇంత లేట్ అవ్వడం వెనుక కారణం ఏమిటనే సందేహం అభిమానుల్లో విపరీతంగా ఉంది. దానికి నిర్మాత టిజి విశ్వప్రసాద్ గతంలో కొంత క్లారిటీ ఇవ్వగా తాజాగా ఇచ్చిన వేరొక ఇంటర్వ్యూలో ఇంకాస్త క్లియర్ పిక్చర్ ఇచ్చారు. అదేంటో చూద్దాం. రాజమౌళి, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్లకు విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా చేసిన వ్యక్తిని రాజా సాబ్ కోసం తీసుకున్నారు. భారీ పారితోషికాన్ని నెల నెల జీతం పద్ధతిలో ఇచ్చేందుకు ఆయన టీమ్ మొత్తానికి మాట్లాడుకున్నారు.
తీరా చూస్తే 2024 అక్టోబర్ దాకా ఒక్కటంటే ఒక్క షాట్ కి పని చేయలేదు. అదేమంటే బెదిరింపు ధోరణితో చేస్తే చేయించుకోండి లేదంటే వెళ్ళిపోతా అనే తరహాలో మాట్లాడ్డంతో దర్శకుడు మారుతీ సైతం మౌనంగా ఉండాల్సి వచ్చింది. చూసి చూసి విసుగు చెందిన నిర్మాత ఇక లాభం లేదని విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ని తప్పించే నిర్ణయం తీసుకున్నారు. జీతం రూపంలో మంచినీళ్లలా డబ్బు ఖర్చవుతోంది తప్ప పని కావడం లేదని గుర్తించి వేరేవాళ్లను లైన్ లోకి తెచ్చుకున్నారు. ఇది జరిగిన కొంత టైంకే రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 నుంచి కూడా సదరు టెక్నీషియన్ ని పంపించేయడం విశ్వప్రసాద్ వర్షన్ కి మరింత బలం చేకూర్చింది.
నేరుగా పేరు చెప్పకపోయినా ఎవరి గురించి అన్నారో సగటు మూవీ లవర్స్ ఈజీగా గుర్తు పట్టేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం. ట్రైలర్, టీజర్ చూశాక రాజా సాబ్ విజువల్ ఎఫెక్ట్స్ లో క్వాలిటీ కనిపించింది. ప్రభాస్ ఫ్యాన్స్ హమ్మయ్యా అనుకున్నారు. అసలే హారర్ డ్రామా. అందులోనూ నాలుగు వందల కోట్ల బడ్జెట్. తెరమీద నాణ్యత కనిపించకపోతే ట్రోలింగ్ బారిన పడాల్సి ఉంటుంది. దీని మీద శ్రద్ధ పెట్టడం వల్లే మిరాయ్ ఊహించనంత అద్భుత ఫలితం అందుకుంది. పరిమిత బడ్జెట్ లోనే అంత రాబట్టుకున్నప్పుడు మరి రాజా సాబ్ కు అంతకు పదింతలు ఎక్స్ పెక్ట్ చేయడంలో ఎంత మాత్రం తప్పు లేదు.