#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సమాధానం చెప్పారు. ఒకరు స్పందిస్తూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని అడగ్గా.. తప్పకుండా చేస్తానన్నారు. ఆమె 2029లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు చెప్పారు. అంటే.. పార్లమెంటుకు కవిత పోటీ చేస్తారన్న చర్చ తెరమీదికి వచ్చింది. వాస్తవానికి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరగనున్నాయి. సో.. ఆమె మాత్రం 2029లో పోటీ చేస్తానని చెప్పడంగమనార్హం.
మరో నెటిజన్ స్పందిస్తూ.. విద్య వ్యాపారం అయిందని, మీరు ముఖ్యమంత్రి అయితే.. ఏం చేస్తారని ప్రశ్నించగా…. తాము అధికారంలోకి వస్తే.. విద్యను మరింత చేరువ చేస్తామన్నారు. పేరెంట్లపై ఎలాంటి ఆర్థిక భారం కాని విధంగా విద్యను అందిస్తామన్నారు. ప్రస్తుత దోపిడీ విధానానికి తాము వ్యతిరేకమన్న కవిత.. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయనున్నట్టు వివరించారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు రూపాయి కూడా కట్టకుండా కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా అందిస్తామన్నారు.
ఇక, రైతుల ఆత్మహత్యలపై కొందరు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. తాను కూడా ఈవిషయంలో చాలా బాధపడుతున్నట్టు కవిత చెప్పారు. ఆదిలాబాద్‌లో పర్యటించినప్పుడు పత్తి రైతులు కొందరు ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం తెలిసి చలించిపోయానన్నారు. అయితే.. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కవిత వ్యాఖ్యానించారు. రైతులకు మేలు చేసేలా తామునిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి పాలన, ఆయన వ్యవహార తీరుపై మీరేమంటారంటూ.. నెటిజన్ అడిగిన ప్రశ్నకు కవిత ఆసక్తికర సమాధానం చెప్పారు. “హామీలను బుట్టదాఖలు చేశారు. నిబద్ధతను నిరూపించుకోవడంలో విఫలమయ్యారు. ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు“ అని కవిత పేర్కొన్నారు. (Broken promises, Failed commitments, People absolutely are dissappointed with the government).
కాగా.. మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. జాగృతి సంస్థను సమాజంలోని ప్రతి ఒక్కరి సాధికారతకు కృషి చేసేలా చేరువ చేస్తామని కవిత చెప్పారు. ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలు సహా అన్ని సామాజిక వర్గాలకూ జాగృతిని చేరువ చేస్తూ..కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.