హైదరాబాద్-శామీర్‌పేట్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర ప్రమాదం జరిగింది. హఠాత్తుగా కారులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఎకో స్పోర్ట్ కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కారులోనే డ్రైవర్ అగ్నికి ఆహుతయ్యాడు. కేవలం అతని అస్థిపంజరం మాత్రమే కనపడడంతో సంఘటన సంచలనం అయ్యింది.
ఈ ఘటన నేపథ్యంలో కొన్ని రకాల కార్లలో భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా డ్రైవర్ సీటు బెల్టు తొలగించుకోలేక చనిపోయిన ఘటనలే అధికంగా ఉన్నాయని నెటిజన్లు తమ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో సీటు బెల్టు పెట్టుకోవడం మంచిదేనని, కానీ ఈ రకంగా అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఆ సీటు బెల్టే డ్రైవర్ల పాలిట యమపాశంగా మారుతోదని అంటున్నారు.
కారులో అగ్నిపమాదాలు జరిగిన సమయంలో సీటు బెల్ట్ కట్ చేసుకునేందుకు వీలుగా అవసరమైన టూల్ ను ప్రతి ఒక్కరు కార్లో అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. కారు అద్దాలు పగలగొట్టేందుకు వీలుగా సుత్తి వంటి టూల్స్ కూడా ఉండాలని సలహా ఇస్తున్నారు.