“మీరు ఏం చేస్తారో.. మాకు అనవసరం.. మనం గెలవాల్సిందే!” ఇదీ.. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో ప్రధాన పార్టీల అధినేతలు.. అధిష్టానాలు క్షేత్రస్థాయి నాయకులకు పెట్టిన కీలక డెడ్‌లైన్. దీనికి తోడు.. దాదాపు 20 మాసాలతర్వాత.. వచ్చిన ఉప ఎన్నిక కూడా కావడంతో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అదేవిధంగా మరోప్రతిపక్షం బీజేపీలు కూడా కీలకంగా తీసుకున్నాయి. దీంతో ఎవరికి వారు.. ప్రజలను కలుసుకునేందుకు వినూత్న పంథాలను అనుసరిస్తున్నారు.
ఉదయం 5కే!
వాస్తవానికి ఎన్నికల కోడ్ ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ.. నాయకులు మాత్రం ఉదయం 5గంటలకే ప్రచారం ప్రారంభించేస్తున్నారు. ఇందిరా పార్క్ నుంచి ట్యాంక్ బండ్ వరకు.. ఎక్కడ మార్నింగ్ వాక్ చేసేవారు ఎక్కువగా ఉంటారో.. తెలుసుకుని.. మరీ అక్కడకు వెళ్లిపోతున్నారు. వారితో కలిసి నడుస్తూ.. వాకర్ల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. కొందరు ఈ సందర్భంగా టీలు.. ఆరోగ్య పానీయాలు కూడా వాకర్లకు ఆఫర్ చేస్తున్నారు.
ఉదయం 9 గంటలకు!
మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని అల్పాహారం పూర్తి చేసిన తర్వాత.. నాయకులు.. క్షణం కూడా తీరిక లేకుండా.. ఇంటింటికీ తిరుగుతున్నారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు మరింత ఎక్కువగానే కష్టిస్తున్నారని చెప్పారు. ఇక, ఈ సందర్భంగా.. ప్రజలకు హామీలు గుప్పిస్తున్నారు. గత ప్రభుత్వాన్ని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.. ప్రస్తుత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇక, ఈ రెండు ప్రభుత్వాలను కూడా బీజేపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇలా.. 12 గంటల వరకు.. ఇంటింటికీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు.
మధ్యాహ్నం 3 నుంచి..
ఇక, మధ్యాహ్నం 3 నుంచి పరిస్థితి మొత్తం యూటర్న్ తీసుకుంటోంది. కార్యకర్తల సంఖ్యను పెంచడం తోపాటు.. బహిరంగ సభలు.. సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేసమయంలో రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలా.. ఎవరి వారు.. సమయ పాలన చేస్తూ.. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇక, ఉదయం వేళల్లో .. కూరగాయలు విక్రయించేవారు.. కాఫీ, టీలు పెట్టేవారు.. సెలూన్లలో కత్తెర పట్టేవారు.. ఇలా.. అనేక రూపాల్లో ప్రచార పర్వం ముందుకు సాగుతుండడంతో జూబ్లీహిల్స్ ఓటర్లకు ఇదో సరదా వాతావరణాన్ని పంచేసిందనే టాక్ వినిపిస్తోంది.