రాజకీయాల్లో ఉన్నవారే కాదు.. సహజం ఏ మహిళ కూడా తన వయసును బయటకు వెల్లడించరు. ఇక, పురుషులు కూడా ఇటీవల కాలంలో వయసును చెప్పడానికి మొహమాట పడుతున్నారు. ఏదైనా పెద్ద అవసరం ఉంటే తప్ప.. ఎవరూ వయసు విషయంలో బయటకు చెప్పరు. ఇక, రాజకీయాల్లో ఉన్నవారు.. ఎన్నికల సమయంలో సమర్పించే అఫిడవిట్లలో తప్ప.. ఎక్కడా వయసును బయట పెట్టుకోరు. అలాంటిది జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత.. తాజాగా తన వయసును నొక్కి నొక్కి మరీ చెప్పుకొచ్చారు. దీంతో అసలు ఆమె ఎందుకలా వ్యాఖ్యానించారన్నది ప్రశ్న.
ఏం జరిగిందంటే..
‘జాగృతి జనం బాట’ పేరుతో కవిత ప్రజల మధ్యకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం నుంచి ఆమె జనం బాటను ప్రారంభించారు. తొలుత హైదరాబాద్‌లో అమర వీరులకు నివాళులర్పించారు. అనంతరం.. నేరుగా నిజామాబాద్ నియో జకవర్గానికి వెళ్లారు. అక్కడకూడా అమర వీరులకు నివాళులర్పించిన తర్వాత.. జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన వారిని ఉద్దేశించి రెండు గంటల పాటు ప్రసంగించారు. అనేక విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావిం చిన కవిత.. మధ్యలో తన వయసును చెప్పుకొచ్చారు.
“నేను 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను.” అని అన్నారు. సరే.. అక్కడితో ఆగిపోతే.. అస లు చర్చ ఉండేది కాదు. అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసిన కవిత.. ఇప్పుడు నా వయసు.. 47 సంవత్సరాలు అన్నారు. అంతేకాదు.. “విన్నారా.. ఇప్పుడు నా వయసు 47 సంవత్సరాలు. 20 ఏళ్లుగా రాష్ట్రంలో.. రాజకీయాల్లో.. ఉద్యమంలో పనిచే స్తున్నా..” అని చెప్పకొచ్చారు. తనకు రాష్ట్రంలోని ప్రతి ఎత్తు పల్లం గురించి తెలుసునన్న కవిత.. ప్రజల కోసమే తాను బయటకు వచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ గురించి ఎక్కువగా వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే.. కవిత తన వయసును ఎందుకు బయటకు చెప్పుకొన్నారన్నది రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చగా మారింది. తాను ఒంటరిగా రాజకీయాలు ప్రారంభించిన నేపథ్యంలో అనేక మంది అనేక సందేహాలు వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా 4 కీలక అంశాలు ఉన్నాయి. వాటికి ఆమె ఇప్పటి వరకు సమాధానం నేరుగా చెప్పలేదు. తాజాగా ప్రస్తావించిన వయసుతో ఆమె అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి ఉంటారన్నది ఒక విశ్లేషణ. మొత్తానికి ఈ విషయం ఇప్పుడు బీఆర్ ఎస్‌లోనే కాకుండా.. ఇతర రాజకీయ పార్టీల్లోనూ చర్చకు దారి తీసింది.
ఇవీ.. ఆ 4 అంశాలు..
1) తన వయసును చెప్పడం ద్వారా.. ఇంకా తాను కేసీఆర్ చాటు బిడ్డను కాదని చెప్పడం.2) రాజకీయంగా కవితకు ఏం తెలుసు..? అనే వారికి తనకు అన్నీ తెలుసునని పరోక్షంగా 20 ఏళ్ల అనుభవాన్ని ప్రస్తావించడం.3) అదేసమయంలో 47 ఏళ్ల వయసులో సొంతగా రాజకీయాలు చేసేందుకు వచ్చానని.. తానేమీ పరిణితి చెందని వ్యక్తిని కాదని చెప్పే ప్రధాన ఉద్దేశం.4) నేటి తరం యువతకు.. సీనియర్లకు కూడా తాను వారధిగా ఉంటానన్న సందేశాన్ని కవిత ఇలా తన వయసు ప్రస్తావన ద్వారా చెప్పి ఉంటారన్న వాదన విశ్లేషకులు చెబుతున్నారు.