బీహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మిత్ర పక్షం రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) గట్టి షాకిచ్చింది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగాలని వేచి చూసిన.. కాంగ్రెస్ ఆడుతున్న రెండు ముక్కలాటను గట్టిగా ఎదిరించింది. సీట్ల కేటాయింపు కోసం వేచి చూసి వేసారిపోయామని.. కాంగ్రెస్ తన గౌరవాన్ని నిలబెట్టుకోలేక పోయిందని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. మహాఘట్ బంధన్‌లో తామే కీలకమని వ్యాఖ్యానించింది. తమ తర్వాతే కూటమి పార్టీలని ఆర్జేడీ స్పష్టం చేసింది.
ఈ క్రమంలో తాజాగా రెండో దశ ఎన్నికలకు సంబంధించి సోమవారం గడువు ముగిసిపోతున్న సమయంలో 143మంది అభ్యర్థులకు హుటాహుటిన మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ బీఫారాలు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఘాటుగా స్పందిం చారు. “కాంగ్రెస్ అయితే ఏంటి? మేమిచ్చిన గౌరవం నిలబెట్టుకోనప్పుడు?“ అని ప్రశ్నించారు. అంతేకాదు.. పొత్తులు అంటూ.. ఒక చేయి చాపడంకాదని.. నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో కీలక ఎన్నికల వేళ బీహార్‌లో పొత్తుల వాతావరణం కీలక దశకు చేరుకుంది.
నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్-ఆర్జేడీలుకలసి కట్టుగా ఎన్నికలకు దిగుతాయని ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా రెండు పార్టీలూ వేర్వేరుగా ఇప్పుడు పోటీ చేసే పరిస్థితి నెలకొంది. ఒకరికి తెలియకుండా ఒకరు టికెట్లు పంపిణీ చేయడం.. అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడం జరిగిపోయాయి. ఈ పరిణామాల క్రమంలో అనూహ్యంగా ఆర్జేడీ 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం, వీటిలో 12-25 స్థానాలు కాంగ్రెస్‌వే కావడం మరోచర్చకు దారి తీసింది. దీంతో ఇక.. పొత్తులు లేనట్టేనన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచారానికి కేవలం 18 రోజుల గడువు మాత్రమే ఉండడం గమనార్హం.
బీజేపీకి కలిసి వస్తుందా?
ప్రస్తుత మహాఘట్ బంధన్ పరిణామాలు బీజేపీకి కలిసివస్తున్నాయన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు.. కాంగ్రెస్-ఆర్జేడీలు బలంగా ఉండడంతో యాదవ సామాజిక వర్గం ఈ కూటమికి మద్దతుగా నిలిచింది. ఇప్పుడు ఈ పొత్తు పోయిన నేపథ్యంలో(నేరుగా ప్రకటించలేదు).. యాదవ సామాజిక వర్గం తిరిగి.. సుశాసన్ బాబు(సీఎం నితీష్‌కుమార్)కే మొగ్గు చూపుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఈ పరిణామాలు పరోక్షంగా బీజేపీకి కలిసి వస్తాయని అంటున్నారు.