hyderabadupdates.com movies కాంతారను కాపాడిన కోర్టు తీర్పు

కాంతారను కాపాడిన కోర్టు తీర్పు

బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ ఇంకా థియేటర్ రన్ బలంగా కొనసాగిస్తూనే ఉంది. తెలుగులో నెమ్మదించినప్పటికీ మళ్లీ దీపావళికి పికప్ అవుతుందన్న నమ్మకం బయ్యర్లలో కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలకు ముందు కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ధరల నియంత్రణ జిఓ మీద హోంబాలే ఫిలిమ్స్ తో పాటు మల్టీప్లెక్స్ అసోసియేషన్ కోర్టుకు వెళ్లడం, వాళ్లకు అనుకూలంగా వాయిదా తీర్పు రావడం చేసిన మేలు అంతా ఇంతా కాదు. ఇప్పటిదాకా శాండల్ వుడ్ లో కాంతారా చాప్టర్ 1 వసూలు చేసిన గ్రాస్ సుమారు 160 కోట్లకు పైనే ఉంటుందని అక్కడి ట్రేడ్ రిపోర్ట్.

ఒకవేళ జిఓ యధాతథంగా అమలైపోయి టికెట్ రేట్ 200, 236 రూపాయలు మించకపోయి ఉంటే ఇప్పుడొచ్చిన మొత్తంలో కనీసం 50 కోట్లకు పైగా చిల్లు పడేదని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అంటే ఒక పెద్ద ఏరియాకు పాడుకున్నంత సొమ్ము ఇది. ఈ రకంగా చూసుకుంటే న్యాయస్థానం జడ్జ్ మెంట్ వల్ల కాంతారా చాలా పెద్ద ప్రయోజనం పొందింది. ఎందుకంటే బెంగళూరు మల్టీప్లెక్సుల్లో స్క్రీన్లు, వసతులను బట్టి 500 నుంచి 2000 రూపాయల దాకా టికెట్ రేట్లు ఉన్నాయి. అవన్నీ తగ్గించుకోవాల్సి వచ్చేది. తీర్పుకు ముందు దాన్ని పాటించారు కూడా. ఆ కొంత టైంలోనే జనాలు తక్కువ ధరల్లో ఎంజాయ్ చేశారు.

అయితే కోర్టు ఇచ్చింది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. త్వరలో జరగబోయే వాయిదాలో సిద్దరామయ్య సర్కార్ తమవైపు వాదనలతో సిద్ధంగా ఉంది. ఒకవేళ అవి బలంగా ఉంటే జీవో మళ్లీ తిరగదోడే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే భవిష్యత్తులో రాబోయే రాజా సాబ్, టాక్సిక్, అఖండ 2 లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ కి సమస్య వస్తుంది. కానీ విశ్లేషకులు మాత్రం అంత రిస్క్ ఉండకపోవచ్చని, మధ్యేమార్గంగా ఒక పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. గవర్నమెంట్ మాత్రం పరిమితి ఉండాల్సిందేనని పట్టు బడుతోంది. ఏదైతేనేం కాంతారా చాప్టర్ 1 క్షేమంగా లాభాలు కళ్లజూసి కలెక్షన్ల పండగ చేసుకుంది.

Related Post