సోషల్ మీడియాలో, బయట ప్రమోషన్లలో కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ సౌండ్ తగ్గిపోయింది. రిషబ్ శెట్టి నార్త్ మీడియాకు వెళ్లి ఇస్తున్న ఇంటర్వ్యూలు తప్ప వేరే హంగామా లేదు. సక్సెస్ టూర్లు, మీట్ల ఊసే లేదు. పది రోజులు కాకుండానే గప్ చుప్ గా అయిదు వందల కోట్ల గ్రాస్ దాటేసి శాండల్ వుడ్ కు మరో బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంతార 1 హఠాత్తుగా రిలాక్స్ అవ్వడానికి కారణం లేకపోలేదు. వీకెండ్ దగ్గరవుతున్న టైంలో ఈ డివోషనల్ డ్రామా మళ్ళీ ఊపందుకుంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడుతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో టికెట్ల అమ్మకాలు బాగున్నాయి. ఏపీ తెలంగాణలో ఆక్యుపెన్సీలు పెరుగుతున్నాయి.
ఇలా టార్గెట్ రీచ్ కాగానే సైలెంట్ అయిపోవడం హోంబాలే ఫిలిమ్స్ ఎప్పటి నుంచో పాటిస్తున్న స్ట్రాటజీ. కెజిఎఫ్, సలార్ లాంటి వాటికి సైతం ఇదే ఫాలో అయ్యారు. వాటికి చేసిన ప్రీ రిలీజ్ పబ్లిసిటీలో కాంతార చాప్టర్ 1కి సగమే జరిగింది. అయినా సరే ఇంత పెద్ద విజయం సాధించడం విశేషం. ముఖ్యంగా బాలీవుడ్ హ్యాండిల్స్ నుంచి ప్రశంసలు, సెలబ్రిటీల నుంచి ట్వీట్లు రావడం చూస్తే రిషబ్ శెట్టి ఈసారి అనుకున్న దానికన్నా పెద్దదే సాధించాడని చెప్పాలి. ఒకవేళ అగ్రెసివ్ ప్రమోషన్లు కనక కొనసాగించి ఉంటే వెయ్యి కోట్ల మార్కు సాధ్యమయ్యేదేమో అని మూవీ లవర్స్ చేస్తున్న కామెంట్స్ లో నిజం లేకపోలేదు.
మన దగ్గర చూస్తే దీపావళికి నాలుగు రిలీజులు క్యూ కట్టాయి. డ్యూడ్, తెలసు కదా, కె ర్యాంప్, మిత్ర మండలి అన్నీ యూత్ ని టార్గెట్ చేసుకుని వస్తున్నాయి. వీటిలో రెండో మూడో ఖచ్చితంగా టార్గెట్ అందుకుంటాయి కూడా. అదే జరిగితే కాంతారా చాప్టర్ 1కి కొంత ఇబ్బంది. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పెంచిన టికెట్ రేట్లే అమలులో ఉన్నాయి. సోమవారం నుంచి సాధారణ ధరలు అందుబాటులోకి వస్తాయి. సో మళ్ళీ పికప్ అయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ఎలాగూ ప్రభుత్వ గరిష్ట ధర ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా వెళ్తోంది. ఓవర్సీస్ లో మాత్రం కాంతారా చాప్టర్ 1 బ్రేక్ ఈవెన్ కావడం మీద అనుమానాలు నెలకొన్నాయి.