శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు.
ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగడంతో చాలామంది భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనఫై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ఘటన తనను కలచి వేసిందని, భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ ఘటనపై హోం శాఖా మంత్రి అనిత స్పందించారు. ఆలయం మొదటి అంతస్థులో ఉందని, 20 మెట్లు ఎక్కి ఆ అంతస్థుకు చేరుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆ క్రమంలో మెట్ల రెయిలింగ్ ఊడి పడడంతోనే ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగిందని తెలిపారు.