కెరీర్ ఇంకా మంచి ఊపులో ఉండగానే పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయింది కీర్తి సురేష్. పేరుకు మలయాళ అమ్మాయే కానీ.. తెలుగు వాళ్లు ఆమెను ఇక్కడి అమ్మాయిలాగే చూస్తారు. తమిళులూ అంతే. గత దశాబ్ద కాలంలో మోస్ట్ లవ్డ్ సౌత్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి.. ఆంటోనీ తటిల్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో కీర్తి ఫలానా నటుడిని పెళ్లాడబోతోందని.. ఒక వ్యాపారవేత్తతో పెళ్లి అని రకరకాల ఊహాగానాలు వచ్చాయి.
కానీ.. చివరికి ఆంటోనీతో తన దీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్నట్లు వెల్లడించి, సడెన్‌గా తనతో పెళ్లికి రెడీ అయిపోవడం తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఐతే ఆంటోనీతో కీర్తి ప్రేమ వయసు కొన్నేళ్లు కాదట. ఏకంగా 15 ఏళ్లుగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారట. కాలేజీ రోజుల్లోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారట. తన కుటుంబ సభ్యులకు కూడా దాచి పెట్టిన ప్రేమ విషయాన్ని కొన్నేళ్ల ముందే బయపెట్టిందట కీర్తి. ఇంకా తన లవ్ స్టోరీ, భర్త గురించి కీర్తి ఒక టీవీ షోలో ఏం చెప్పిందంటే..
‘‘మేమిద్దరం కాలేజీ రోజుల్లో ఉండగా 2010లో ప్రేమలో పడ్డాం. కానీ ముందు నా చదువు పూర్తి కావాలని ఆలోచించాను. కెరీర్ పరంగా ఎటువైపు అన్నది కూడా అప్పటికి ఏ నిర్ణయం తీసుకోలేదు. జీవితంలో ఇద్దరం స్థిరపడ్డ తర్వాతే పెళ్లి అనుకున్నాం. తర్వాత నేను సినిమాల్లోకి వచ్చాను. గత ఆరేడేళ్లుగా సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాను. ఆంటోనీ బిజినెస్‌లో తీరిక లేకుండా ఉన్నాడు. అతను ఖతార్‌లో ఆయిల్ వ్యాపారం చూసుకునేవాడు.
పెళ్లి గురించి ఇంట్లో చెప్పాలని అనుకున్నాక.. మతం విషయంలో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం. అయినా ఒక రోజు నాన్న దగ్గరికి వెళ్లి విషయం చెప్పాను. ఆయన్నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. సింపుల్‌గానే పెళ్లి గురించి ఒప్పుకున్నారు. ఆయనకు విషయం చెప్పింది నాలుగేళ్ల ముందే. ఆంటోనీ ఇంట్లోనూ అంగీకారం తెలపడంతో సంతోషంగా మా పెళ్లి జరిగింది’’ అని కీర్తి వెల్లడించింది.