hyderabadupdates.com movies కుమారి 22 ఎఫ్.. చిన్న ట్విస్టుంది

కుమారి 22 ఎఫ్.. చిన్న ట్విస్టుంది

టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్‌ను నిర్మాతగా మార్చిన చిత్రం.. కుమారి 21 ఎఫ్. ఒక హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో సుకుమారే స్వయంగా స్క్రిప్టు రాసి తన శిష్యుడైన సూర్యప్రతాప్‌కు అందిస్తే.. అతను యూత్‌కు నచ్చేలా ఈ సినిమాను తీర్చిదిద్దాడు. సుకుమార్ రైటింగ్స్ బేనర్ నుంచి వచ్చిన తొలి చిత్రమిది. అప్పట్లో ఇది పెద్ద హిట్టే అయింది. ఆ తర్వాత ఈ బేనర్ మీద మరిన్ని చిత్రాలను నిర్మించాడు సుకుమార్.

ఇప్పుడు సుకుమార్ దర్శకత్వం వహించే చిత్రాల్లోనూ ఆ సంస్థ భాగస్వామిగా ఉంటోంది. తన పారితోషకాన్నే పెట్టుబడిగా పెట్టి లాభాల రూపంలో వాటా తీసుకుంటున్నాడు సుక్కు. కాగా ఇప్పుడు సుకుమార్ కుటుంబం నుంచే త్వరలో రెండు బేనర్లు రాబోతుండడం విశేషం. ఆయన అన్న కొడుకు అశోక్ నిర్మాణంలో ఒక సినిమా రాబోతోంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించనున్న ఈ చిత్రంతో వీరా కోగటం అనే సుకుమార్ అసిస్టెంట్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

మరోవైపు సుకుమార్ సతీమణి తబిత సొంతంగా నిర్మాణ సంస్థను మొదలుపెడుతున్నారు. ఇప్పటికే ఆమె సమర్పణలో ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ అనే సినిమా వచ్చింది. అదంతగా ఆకట్టుకోలేదు. ఐతే ఆ సినిమాకు తబిత ప్రెజెంటర్ మాత్రమే, నిర్మాత కాదు. ఇప్పుడు ఆమె సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను మొదలుపెడుతోంది. దానికి ‘తబిత సుకుమార్ ఫిలిమ్స్’గా నామకరణం చేశారు. ఈ సంస్థలో తొలి సినిమాగా ‘కుమారి 22 ఎఫ్’ రాబోతోంది. ఈ పేరు చూస్తే ఇది ‘కుమారి 21 ఎఫ్’ సీక్వెల్ అని అర్థమవుతుంది.

ఐతే ఈ సినిమా దానికి కొనసాగింపుగా కాకుండా ఫ్రాంఛైజ్ మూవీలా ఉంటుంది. అంటే అలాంటి పాత్రలు, వరల్డ్ కంటిన్యూ అవుతుంది కానీ.. ఇది వేరే కథ. ఆర్టిస్టులు కూడా మారతారు. మరి ఈ చిత్రాన్ని సూర్యప్రతాపే డైరెక్ట్ చేస్తాడా.. లేక డైరెక్టర్ కూడా మారతాడా అన్నది చూడాలి. సుకుమార్ తనయురాలు సుకృతి గత ఏడాది ‘గాంధీ తాత చెట్టు’ సినిమాలో లీడ్ రోల్ చేయడం, ఆ చిత్రానికి ఆమె జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం అందుకోవడం తెలిసిందే.

Related Post