టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై మంత్రి కొండా సురేఖ కొద్ది రోజుల క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో కొండా సురేఖ చేసిన కామెంట్లు టాలీవుడ్ లో కాక రేపాయి. దీంతో, కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. అయితే, అనూహ్యంగా నాగార్జునపై, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని కొండా సురేఖ ప్రకటించారు.
తాను ఉద్దేశ్యపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, నాగార్జునను, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలన్న, అవమానపరచాలన్న ఉద్దేశ్యం తనకు లేదని చెప్పారు. తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని సురేఖ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే, రేపు ఈ కేసు విచారణ జరగబోతున్న క్రమంలో నాగార్జున ఆ కేసు వెనక్కు తీసుకుంటారా లేదా అన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖపై పెట్టిన కేసును నాగార్జున వెనక్కు తీసుకున్నారు.
వర్చువల్ విధానంలో కోర్టుకు ఈ విషయాన్ని నాగార్జున వెల్లడించారు. నాగార్జున ఈ కేసును ఉపసంహరించుకోవడంతో ఆ కేసు కొట్టివేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. దీంతో, ఈ ఎపిసోడ్ కు తెరపడినట్లయింది. అయితే, ఇకపై అయినా రాజకీయ నాయకులు మాట్లాడేప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సినీ నటులైనా..వేరెవరైనా…వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు పలుకుతున్నారు.