రాజకీయాల్లో గెలుపు – ఓటములు దోబూచులాడుతూనే ఉంటాయి. అయితే.. ఇది ఇప్పటి మాట. కొన్నాళ్ల కిందట పరిస్థితిని గమనిస్తే.. వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి గెలిచిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది కీలక నాయకుల పోరులో కూడా.. వరుసగా విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దీనికి కారణం.. అప్పట్లో వారు పనులు చేశారు. ప్రజలకు చేరువ అయ్యారు. సీనియర్ల సలహాలు పాటించారు. ఫలితంగా 20 ఏళ్లు, 30 ఏళ్లపాటు ఒకే నియోజకవర్గంలో వరుస విజయాలు దక్కించుకున్నారు.
ఈ కీలక విషయం నేటి తరం కొత్త ఎమ్మెల్యేలకు దిక్సూచి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో పరిస్థితిని గమనిస్తే.. ఒకసారి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యే మళ్లీ గెలుస్తారన్న నమ్మకం లేదు. దీంతో ఒక్కసారి గెలిచాం కదా.. ఏదైనా చేయొచ్చు! అనే ధోరణి కనిపిస్తోంది. కానీ.. ఒక్కసారి గెలిచిన తర్వాత.. దానిని పదే పదే నిలబెట్టుకునేందుకు ఎమ్మెల్యేలు చిన్న చిన్న పనులు చేస్తే చాలని అంటున్నారు పరిశీలకులు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు సహజం. కాబట్టి వాటిలో విజయం దక్కించుకునేందుకు నాయకులు ప్రయత్నించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
కీలకమైన ఐదు విషయాలు..
1) గంట సేపు ప్రజలతో మమేకం: ఉదయం లేదా.. సాయంత్రం వేళల్లోప్రజలకు ఎమ్మెల్యే చేరువగా ఉంటే చాలు.. ఆయన పేరు ప్రజల నాలుకలపై వినిపిస్తుంది. మా ఎమ్మెల్యే ఎప్పుడెళ్లినా అందుబాటులో ఉంటాడు.. అనే మాట తెచ్చుకుంటే చాలు. ఎన్ని ఎన్నికలు వచ్చినా విజయం మీదే.
2) సెంటిమెంటు: ఎమ్మెల్యేలు స్థానికులతో ఏం మాట్లాడాల్సి వచ్చినా.. వారి సమస్యలను ప్రస్తావిస్తూ.. సెంటిమెంటును రంగరిస్తే.. వారి మనసుల్లో స్థానం పదిలంగా ఉంటుంది. పేదల వద్దకు వెళ్లినప్పుడు.. వారిలో కలిసి పోవాలి. డంబాలు ప్రదర్శించకూడదు. ఇది మరింత పేరు తెస్తుంది.
3) నేనున్నానన్న భరోసా: నియోజకవర్గం ప్రజలకు ఏ ఆపద వచ్చినా.. ఏ ఘటన జరిగినా.. ఏ ఇబ్బంది వచ్చినా.. ఎమ్మెల్యేగా నేనున్నానన్న భరోసా వారికి కల్పిస్తే.. అదే కొండంత అండ. దీనికి ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. పైగా.. ఎన్నికల సమయంలోనూ ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి సదరు సమస్యను ఎమ్మెల్యే పరిష్కరించలేకపోయినా.. ఆయన ప్రయత్నం చేశాడు.. అన్న పేరు వస్తుంది. తద్వారా ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటారు.
4) కలుపుకొనే తత్వం: తన మన అన్న తేడా లేకుండా నియోజకవర్గంలోని అందరినీ కలుపుకొని వెళ్లే తత్వం ఉండాలి. నాకు ఓటేయలేదు కాబట్టి.. నువ్వు నాకు వద్దు! అనే పరిస్థితి ఉండకూడదు. ఎవరు ఓటేసినా.. వేయకపోయినా.. అందరినీ తన వారిగా చూస్తే.. ఎమ్మెల్యేపై మనసు పెరుగుతుంది.
5) తరచుగా చేరువ: పండగలు, పుట్టిన రోజులు, పెళ్లిరోజులకు ఎమ్మెల్యేలకు సహజంగానే ఆహ్వానాలు అందుతాయి. వీటిని వారు సద్వినియోగం చేసుకుంటే.. ఇక, వారికి తిరుగే ఉండదు. సో.. ఈ ట్రిక్స్ పాటిస్తే.. ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికలేం ఖర్మ.. కొన్ని దశాబ్దాల పాటు వారే గెలిచే అవకాశం ఉంటుంది.