మాములుగా ఇంట్లో ఉన్నప్పుడు అన్నం లేదా చపాతీ తింటూ సినిమాలు టీవీలో చూడటం సహజం. ఇందులో వింతేమీ లేదు. అలాగే పాప్ కార్న్, నాచోస్ నములుతూ థియేటర్లో బిగ్ స్క్రీన్ ఎంజాయ్ చేయడం కొత్తేమి కాదు. కానీ ఈ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది. పివిఆర్ ఐనాక్స్ ఆ ఆలోచన రావడం ఆలస్యం అమలులో పెట్టేసింది. బెంగళూరులోని ఎం5 సిటీ మాల్ లో ఉన్న ఎనిమిది స్క్రీన్ల సముదాయంలో ఒకదాన్ని పూర్తి రెస్టారెంట్ గా మార్చేసింది. అంటే మనం హోటల్ లో ఎలాగైతే రౌండ్ టేబుల్ చుట్టూ కూచుని తింటామో అచ్చం అలాగే ఇందులో కూడా ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో పాటు డైనిన్ చేయొచ్చు.
ధరలు కొంచెం ప్రియంగానే ఉన్నాయి. ఉదాహరణకు కాంతార చాప్టర్ 1 నలుగురు కలిసి చూడాలంటే జస్ట్ 1340 రూపాయలు చెల్లించాలి. ముగ్గురు ఉంటే 820, ఇద్దరు ఉంటే 740 రూపాయలు చెల్లించాలి. వీటికి బుకింగ్ చార్జీలు అదనం. విడిగా లెక్క చూస్తే ఇంత ఖరీదైన ఎక్స్ పీరియన్స్ కి ఇది సబబైన ధరే. అందుకే మొదలుపెట్టడం ఆలస్యం టికెట్లు చాలా ముందస్తుగా అమ్ముడుపోతున్నాయట. అయితే తినడం మీద దృష్టి పెట్టి సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం ఇలాంటి వాటి వల్ల కోల్పోతారనే కామెంట్స్ ఉన్నప్పటికి జనాలు అవేవి పట్టించుకోకుండా శుభ్రంగా టికెట్లు బుక్ చేసేసుకుంటున్నారు.
ఒకప్పుడు తెల్లని బట్టలాంటి తెరమీద మసక ప్రొజెక్టర్లతో సినిమాలు చూపించేవాళ్ళు. నేల క్లాసు విడిగా ఉండేది. బటానీలు, సమోసాలు, సోడాలు తాగుతూ తింటూ అదో రకమైన ఆనందాన్ని మొన్నటి తరం ప్రేక్షకులు పొందారు. తర్వాత ఏసీలు పెరిగాయి. సోఫాలు వచ్చాయి. కుషన్ సీట్లు, పుష్ బ్యాక్లు, రిక్లైనర్లు ఒకటా రెండా రకరకాల మార్పులు చోటు చేసుకున్నాయి. 3డి, 4డిఎక్స్, ఐస్, డి బాక్స్, ఎపిక్ స్క్రీన్ అంటూ కొత్త కొత్త ఎక్స్ పీరియన్సులు పంచుతున్నాయి. ఇప్పుడు భోజనాలు చేస్తూ సినిమా చూడటమనే వెరైటీ ట్రెండ్ క్రమంగా పెరిగేలా ఉంది. దేశవ్యాప్తంగా త్వరలో అయిదారు మొదలుపెడతారట.