భారతీయ సినీ సంగీతంలో ఇళయరాజాది ఒక ప్రత్యేక అధ్యాయం. ముఖ్యంగా దక్షిణాది సినీ సంగీతంపై ఆయన వేసిన ముద్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని కోట్ల మందికి ఆయన ఆల్ టైం ఫేవరెట్. వాళ్లకు దశాబ్దాలుగా తన పాటలతో ఆయన అద్భుత అనుభూతిని ఇస్తూ ఉన్నారు ఇళయరాజా. సంగీతం సంగతి పక్కన పెడితే.. ఇళయరాజా వ్యవహార శైలి చాలా సీరియస్‌గా ఉంటుంది, ఆయన మాట కొంచెం కఠినంగా ఉంటుంది అన్న విషయం తెలిసిన సంగతే.
ఇళయరాజా తక్కువగానే మాట్లాడతారు కానీ.. అవసరమైనపుడు ఎవరినైనా విమర్శించడానికి ఆయన వెనుకాడరు. ప్రస్తుతం పాటలు రూపొందుతున్న తీరు మీద ఓ ఇంటర్వ్యూలో ఆయన విమర్శలు గుప్పించారు. సింగర్స్, కంపోజర్స్, మ్యుజీషియన్స్ ఎక్కడెక్కడో ఉండి వేర్వేరుగా పాట కోసం పని చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇలా చేస్తే మంచి పాటలు ఎలా రూపొందుతాయని ఆయన ప్రశ్నించారు.
తన పాటలు సంగీత ప్రియుల జీవితాల్లో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్న ఇళయరాజా.. ఈ కాలంలో వస్తున్న పాటలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదన్నారు. మేల్ సింగర్ పాడింది ఫిమేల్ సింగర్‌కు తెలియదని.. ఒకరి ట్రాక్ గురించి ఇంకొకరికి తెలియకుండానే పాట రెడీ అవుతోందని.. దర్శకులకు పాట గురించి ఏమీ క్లారిటీ ఉండడం లేదని ఆయన అన్నారు.
గతంలో 60 మంది ఆర్కెస్ట్రా ఒకే చోట ఉండి పాటలు కంపోజ్ చేసేవాళ్లమని.. తాను పాట రికార్డ్ చేసే టైం, మ్యుజీషియన్స్, సింగర్లతో పాటు పాడే స్టూడియో గురించి నమోదు చేసేవాడినని.. అందరూ ఒక చోట ఉండేలా చూసుకునేవాడనని.. ఆ 60 మంది ఒకేసారి కృషి చేస్తే 4 నిమిషాల మంచి పాట తయారయ్యేదని ఆయనన్నారు. కానీ ఇప్పుడు మ్యూజిక్ చేసే వాళ్లు ఎక్కడెక్కడో ఉంటున్నారని.. కనీసం లైన్లో కూడా ఉండడం లేదని.. పాటలు జీవం కోల్పోతుండడానికి ఇదే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.