యాపిల్ లేటెస్ట్ గా విడుదల చేసిన M5 మ్యాక్‌బుక్ ప్రో ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త 14 అంగుళాల మోడల్, ఆన్ డివైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పనితీరును పెంచడానికి రూపొందించబడింది. ఇది గత సంవత్సరం వచ్చిన M4 మ్యాక్‌బుక్ ప్రోకు ఎంతవరకు అప్‌గ్రేడ్‌గా ఉంది, డిజైన్‌లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది. రెండు చిప్‌ల మధ్య ప్రధాన వ్యత్యాసం AI అలాగే ప్రాసెసింగ్ వేగంలో మాత్రమే తేడా ఉన్నట్లు తెలుస్తోంది.
డిజైన్, లుక్ పరంగా చూస్తే M5 మ్యాక్‌బుక్ ప్రో, M4 కంటే ఏమాత్రం భిన్నంగా లేదు. ఈ రెండు మోడల్స్‌లో ఒకే అల్యూమినియం బాడీ, ఒకే కొలతలు, అలాగే అదే స్పేస్ బ్లాక్, సిల్వర్ రంగులు కొనసాగుతున్నాయి. డిజైన్‌లో యాపిల్ ఎలాంటి మార్పులూ చేయలేదు. అదేవిధంగా, డిస్‌ప్లే ఫీచర్లు కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. రెండూ 14.2 అంగుళాల లిక్విడ్ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz ప్రోమోషన్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ రెండింటిలోనూ ఒకేలా ఉంది.
అయితే, అసలైన చెంజెస్ మాత్రం లోపల ఉన్నాయి. M4 చిప్‌లో 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉండగా, M5 చిప్ దానితో పాటు ప్రతి GPU కోర్ లోనూ న్యూరల్ యాక్సిలరేటర్‌ను జత చేసింది. ఈ డిజైన్ కారణంగా, M5 చిప్ M4 కంటే 3.5 రెట్లు వేగంగా AI పనులను హ్యాండిల్ చేయగలదు. అంతేకాకుండా, గ్రాఫిక్స్ పనితీరు 1.6 రెట్లు వేగంగా, CPU పనితీరు సుమారు 20 శాతం మెరుగ్గా ఉంటుందని యాపిల్ చెబుతోంది.
కెమెరా, ఆడియో సెటప్‌లో కూడా మార్పులు లేవు. రెండూ 12MP సెంటర్ స్టేజ్ కెమెరా, ఆరు స్పీకర్ల సిస్టమ్‌తో వస్తాయి. స్టోరేజ్, పోర్ట్స్ విషయంలోనూ పోలిక ఉంది. రెండింటి బేస్ మోడల్స్‌లో 16GB మెమొరీ, 512GB SSD స్టోరేజ్ ఉంటాయి. కాకపోతే M5 మ్యాక్‌బుక్ ప్రోలో 4TB స్టోరేజ్ ఆప్షన్‌ను కొత్తగా ఇచ్చారు. థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు, HDMI, MagSafe ఛార్జింగ్ అన్నీ ఒకేలా ఉన్నాయి.
బ్యాటరీ సామర్థ్యం కూడా రెండు మోడళ్లలో ఒకే విధంగా ఉంది. 72.4 వాట్అవర్ బ్యాటరీతో 24 గంటల వీడియో ప్లేబ్యాక్ లేదా 16 గంటల వెబ్ వాడకాన్ని అందించగలవు. M5 మ్యాక్‌బుక్ ప్రో బేస్ మోడల్ ధర రూ.1,69,900 వద్ద ఉండగా, M4 లాంచ్ ధర రూ.1,99,900 కన్నా తక్కువగా ఉండటం ఒక రిలీఫ్.
చివరిగా చెప్పాలంటే, M5 మ్యాక్‌బుక్ ప్రో పాత డిజైన్‌ను కొనసాగించినా, ఫాస్టెస్ట్ ప్రాసెసింగ్ అలాగే స్థానిక AI హ్యాండ్లింగ్ కోరుకునే యూజర్లకు ఇది మంచి అప్‌గ్రేడ్. కానీ ఇప్పటికే M4 ఉన్నవారు, కేవలం డిజైన్ కోసం అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే, పెద్దగా తేడా కనిపించకపోవచ్చు. ఏదేమైనా ఈసారి యాపిల్ పూర్తిగా ఇంటర్నల్ పవర్ పైనే ఫోకస్ పెట్టింది.