hyderabadupdates.com movies కొలిక‌పూడి వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు సీరియ‌స్‌.. స‌స్పెన్ష‌న్ వేటుకు రెడీ?

కొలిక‌పూడి వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు సీరియ‌స్‌.. స‌స్పెన్ష‌న్ వేటుకు రెడీ?

రాష్ట్రంలో రాజ‌కీయ మంట‌లు రేపిన తిరువూరు ఎమ్మెల్యే, ఎస్సీ నాయ‌కుడు కొలిక‌పూడి శ్రీనివాస‌రావు వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం అబుదాబీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌.. రాష్ట్రంలో వ‌ర్షాలు.. వ‌ర‌ద‌ల ప‌రిస్థితిపై ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి.. అధికారుల‌తో ఫోన్‌లో ఆరా తీస్తున్నారు. ఈ క్ర‌మంలో అనూహ్యంగా తెర‌మీదికి వ‌చ్చిన‌.. కొలిక పూడి వ్య‌వ‌హారంపైనా ఆయ‌న స్పందించారు.

“దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నా. దీని వెనుక ఎవ‌రున్నారు? ఏం చేస్తున్నారు?  ఆయ‌న ఎవ‌రి వ‌ల‌లో చిక్కుకున్నారు. ఉద్దేశ పూర్వ‌కంగా చేస్తే.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు వెనుకాడ‌ను. త‌క్ష‌ణ‌మే నాకు నివేదిక అందించండి. అందించాలి“ అని పార్టీ రాష్ట్ర చీఫ్ ప‌ల్లా శ్రీనివాస‌రావును చంద్ర‌బాబు ఆదేశించారు. మ‌రోవైపు కొలికపూడి వ్య‌వ‌హారం మ‌రింత ముదిరింది. త‌న వాట్సాప్ స్టేట‌స్‌లో ఎంపీ కేశినేని నానిని ఉద్దేశించి `వాడు-వీడు` అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. గురువారం సాయంత్రం నుంచి ఆయ‌న వ‌రుస‌గా స్టేట‌స్‌లు పెడుతూనే ఉన్నారు. తొలుత త‌న‌కు టికెట్ ఇవ్వ‌లేద‌ని.. అమ్మార‌ని పేర్కొన్న ఆయ‌న‌.. దీనికి సంబంధించి తాను బ‌దిలీ చేసిన న‌గ‌దు వివ‌రాల‌తో బ్యాంకు స్టేట్ మెంట్ పెట్టారు. త‌ర్వాత‌.. వైసీపీ నాయ‌కుల‌తో కేశినేనిని బంధం ఉందంటూ.. ఓ వీడియోను జ‌త చేశారు. అనంత‌రం.. “ఎవ‌రు బ‌డితే వాడు.. ఎప్పుడు బ‌డితే అప్పుడు రావ‌డానికి తిరువూరు ప‌బ్లిక్ పార్కు కాదు“ అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఈ ప‌రిణామాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పైగా శుక్ర‌వారం మీడియా ముందుకు వ‌చ్చి.. మిగిలిన విష‌యాలు చెబుతానంటూ హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో స్పందించిన చంద్ర‌బాబు త‌క్ష‌ణ‌మే త‌న‌కు నివేదిక ఇవ్వాల‌ని పార్టీని ఆదేశించారు. దీనిని బ‌ట్టి.. ఏక్ష‌ణమైనా.. కొలిక‌పూడిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసే అవ‌కాశం ఉంద‌ని.. టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Related Post