తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు మొలుస్తున్నాయి. ఒక ప్రాంతాన్ని మించి మరో ప్రాంతం దూసుకుపోవడానికి పోటీ పడుతోంది. తాజాగా కోకాపేట భూములకు ప్రభుత్వం వేలం నిర్వహించగా ఇక్కడి భూములు రాయదుర్గంతో పోటీ పడుతున్నాయనేలా రికార్డు ధరలు పలికాయి. ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. దీంతో ప్రభుత్వంలో ఆనందం వ్యక్తమవుతోంది. తాజాగా కోకాపేటలో 5 ఎకరాలను వేలం ద్వారా విక్రయించారు. అయితే ఊహించిన ధర కంటే ఎక్కువగా సొమ్ము రావడం గమనార్హం. గతానికి భిన్నంగా ఇప్పుడు భారీ ఎత్తున స్పందన రావడం, భూముల విలువ కోట్లు పలకడం అధికారులను కూడా ఆశ్చర్యపరిచింది.
వాస్తవానికి రాయదుర్గంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో భూములు పలుకుతున్నాయి. దీనికి కారణం కూడా ఉంది. ఇది హైటెక్ సిటీకి సమీపంలో ఉండడం, పైగా హైదరాబాద్ మెట్రో పరిధిలో ఉండడం ప్రధాన కారణాలు. దీంతో ఇక్కడి భూములు ఎకరానికి 177 కోట్ల రూపాయలు పలికాయి. వాస్తవానికి ప్రభుత్వం ఇక్కడి భూములు 100 కోట్ల మేరకు పలుకుతాయనిచె ఆంచనా వేసింది. కానీ ప్రభుత్వ అంచనాలను మించి, ఇటీవల 7.67 ఎకరాలను విక్రయించగా భారీగా ధర పలికి, ప్రభుత్వ అంచనాలకు మించి సొమ్ము వచ్చింది. ఇక్కడ ఎకరానికి 177 కోట్ల రూపాయల చొప్పున ఒక సంస్థ భూమి కొనుగోలు చేసింది.
ఇప్పుడు కోకాపేట విషయానికి వస్తే ఇది రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతం. పైగా శివారులో ఎక్కడో విసిరేసినట్టుగా కనిపించే ప్రాంతం. అయినా తాజాగా ఇక్కడి భూములు కూడా రాయదుర్గంతో పోటీ పడుతున్నట్టుగా అనిపించాయి. ఇక్కడి నియోపొలిస్ ప్రాంతంలోని భూములను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఎకరానికి 99 కోట్ల రూపాయలు ధరగా నిర్ణయించింది. కానీ అనూహ్యంగా ఎకరానికి 137 కోట్ల రూపాయలు పలికాయి. ఇది ఇటీవల కాలంలో హైదరాబాద్కు వెలుపల నమోదైన అత్యధిక ధర అని తెలంగాణ పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇలా భారీ ఎత్తున భూములకు రెక్కలు రావడం వెనుక ఫ్యూచర్ సిటీ ప్రాభవం కూడా ఉన్నట్టుగా అంచనాలు వెలువడుతున్నాయి.