తొలి సినిమాతోనే తమదైన ముద్ర వేయడం ఎందరో దర్శకులు చేస్తారు కానీ ఒక క్రియేటివ్ పాత్ సృష్టించి తమను అనుసరించేలా చేయడం మాత్రం కొందరికే సాధ్యం. అలా ముందువరసలో చెప్పుకోదగ్గ పేరు కృష్ణవంశీ. ఆయన మొదటి సినిమా గులాబీ ముప్పై వసంతాలు పూర్తి చేసుకుంది. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళొద్దాం. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా చేస్తున్న టైంలో కృష్ణవంశీ టాలెంట్ గుర్తించిన గురువు ఎప్పటికైనా తొలి అవకాశం నిర్మాతగా తనే ఇస్తానని మంచి సబ్జెక్టు ఉంటే తయారు చేసుకోమని మాట ఇచ్చారు. దాంతో ఎలాగైనా ఆయన్ను మెప్పించాలనే సంకల్పంతో స్టోరీ సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టారు.
ఓసారి ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పడుచు అమ్మాయిని వయసు మళ్ళిన దుబాయ్ షేక్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని గుర్తించిన ఎయిర్ హోస్టెస్ వెంటనే పోలీసులను అలెర్ట్ చేసి అతన్ని పట్టించింది. ఇదంతా ప్రత్యక్షంగా చూసిన కృష్ణవంశీకి మనసులో ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. అదే గులాబీ. ప్రాణంగా ప్రేమించుకున్న ఒక జంట స్నేహితుడి వల్ల మోసపోయి హీరోయిన్ అక్రమ రవాణాకు బలిపశువుగా మారేందుకు సిద్ధపడుతుంది. దీన్ని ఆలస్యంగా గుర్తించిన హీరో ఆమెను ఎలా కాపాడి తన ప్రేమను గెలిపించుకున్నాడనేది గులాబిలోని మెయిన్ పాయింట్. ఎంటర్ టైన్మెంట్, సీరియస్ నెస్ సమపాళ్లలో ఉంటాయి.
హడావిడి, కమర్షియల్ హంగులు లేకుండా నిజాయితీగా కృష్ణవంశీ చేసిన ప్రయత్నం వర్మని ఆకట్టుకుంది. దీంతో పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు. కొత్త కుర్రాడు శశిప్రీతంతో అద్భుతమైన పాటలు కంపోజ్ చేయించుకున్నారు కృష్ణవంశీ. బైక్ మీద అరకులో షూట్ చేసిన మేఘాలలో తేలిపొమ్మనది, కాలేజీలో వచ్చే క్లాసు రూములు తపస్సు చేయడమన్నది, సునీత పాడిన ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో సాంగ్స్ యూత్ ని ఉర్రూతలూగించాయి. మెయిన్ విలన్ గా నటించిన జీవా గులాబీ తర్వాత బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు. జెడి చక్రవర్తి, మహేశ్వరి జంటను యూత్ అక్కున చేర్చుకున్నారు. 1995 నవంబర్ 3 విడుదలైన ఈ కల్ట్ క్లాసిక్ మూడు దశాబ్దాలు దాటుతున్నా ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపించడం ఈ మాస్టర్ పీస్ లోని గొప్పదనం. గులాబీ చూసే నాగార్జున నిన్నే పెళ్లాడతా ఆఫర్ ఇవ్వడం మరో చరిత్ర.