సౌతాఫ్రికా చేతిలో టీమిండియా 0-2తో వైట్‌వాష్ అవ్వడం, గువాహటి టెస్టులో 408 పరుగుల ఘోర పరాభవం చవిచూడటంతో ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్టేడియంలోనే గంభీర్ పై రకరకాల నినాదాలు చేసే స్థాయికి పరిస్థితి వెళ్లిపోయింది. గౌతమ్ గంభీర్‌ను కోచ్‌గా తీసేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్న వేళ, లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం గంభీర్‌కు గట్టి మద్దతుగా నిలిచారు. విమర్శకులకు తనదైన శైలిలో చురకలు అంటించారు.
గవాస్కర్ విమర్శకులను సూటిగా ఒక ప్రశ్న అడిగారు. “ఇప్పుడు గంభీర్‌ను తీసేయాలని అరుస్తున్నారు కదా.. మరి ఆయన కోచింగ్‌లో ఇండియా ‘ఛాంపియన్స్ ట్రోఫీ’, ‘ఆసియా కప్’ గెలిచినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? అప్పుడు గంభీర్ తోపు, ఆయనకు లైఫ్ టైమ్ కాంట్రాక్ట్ ఇవ్వాలి అని మీరెవరైనా అడిగారా? లేదు కదా. గెలిచినప్పుడు క్రెడిట్ ఇవ్వడానికి ముందుకు రాని వాళ్లు, ఓడిపోగానే కోచ్‌ను బలిపశువును చేయడం ఏంటి?” అని గవాస్కర్ లాజిక్‌తో కొట్టారు.
కోచ్ పాత్ర ఎంతవరకూ ఉంటుందో కూడా సన్నీ క్లారిటీ ఇచ్చారు. “ఒక కోచ్ టీమ్‌ను సిద్ధం చేయగలడు, తన అనుభవంతో సలహాలు ఇవ్వగలడు. కానీ గ్రౌండ్‌లో బ్యాట్ పట్టి ఆడాల్సింది ప్లేయర్లే కదా. ఆ 22 గజాల పిచ్ మీద ఆటగాళ్లు విఫలమైతే, దానికి కోచ్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం ఎంతవరకు న్యాయం?” అని ఆయన నిలదీశారు. జట్టు ఓడిపోయిన ప్రతిసారీ కోచ్ వైపు వేలు చూపించడం మనకు అలవాటైపోయిందని మండిపడ్డారు.
ఇక గంభీర్‌ను కేవలం వైట్ బాల్ కోచ్‌గా ఉంచి, టెస్టుల నుంచి తప్పించాలనే వాదనను కూడా గవాస్కర్ కొట్టిపారేశారు. ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఉదాహరణను ప్రస్తావిస్తూ.. “చాలా దేశాలకు మూడు ఫార్మాట్లకు ఒకే కోచ్ ఉన్నాడు. మెకల్లమ్ ఇంగ్లాండ్ టీమ్‌ను అలాగే నడిపిస్తున్నాడు. గంభీర్ కూడా కొనసాగడంలో తప్పేమీ లేదు” అని అభిప్రాయపడ్డారు.
మొత్తానికి, గెలిచినప్పుడు చప్పట్లు కొట్టని చేతులు, ఓడినప్పుడు రాళ్లు వేయడానికి లేవకూడదని గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గంభీర్ గత విజయాలను మర్చిపోయి, కేవలం ఒక టెస్ట్ సిరీస్ ఓటమిని పట్టుకుని వేలాడటం అన్యాయమని ఆయన తేల్చి చెప్పారు. మరి గవాస్కర్ వ్యాఖ్యలతోనైనా విమర్శల దాడి తగ్గుతుందేమో చూడాలి.