ఏపీ ప్రభుత్వం తాజాగా గూగుల్, దాని అనుబంధ సంస్థ రైడైన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద.. వచ్చే రెండేళ్లలో విశాఖలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు.. దీనివల్ల రాష్ట్రానికి ఆదాయంతోపాటు.. సుమారు రెండు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది ఏపీ సర్కారుతోపాటు..రాష్ట్రానికి కూడా గేమ్ చేంజర్‌గా మారనుంది. కీలకమైన ఈ ప్రాజెక్టుకు మంగళవారం ముహూర్తం కుదిరింది.
అయితే.. ఈ ఒప్పందం సాకారం కావడం.. గూగుల్ సంస్థను ఒప్పించడం.. విశాఖలో ఉన్న పరిస్థితులు.. సర్కారు అందించే సౌకర్యాలు.. ఇలా అనేక అంశాల విషయంలో ఆ సంస్థను ఒప్పించి.. మెప్పించిన ఘనత పూర్తిగా మంత్రి నారా లోకేష్‌కే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. ఆయన కష్టం అలాంటిదిమరి! గత ఏడాది కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. నారా లోకేష్ అక్టోబరు..(ఇదే నెల)లో అమెరికాలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అదే తొలిసారి.. ఆయన అక్కడ అడుగు పెట్టడం. వెళ్లిన వెంటనే ఆయనకు అనేక అనుమానాలు.. సందేహాలు వచ్చాయి. ఏపీలో ఉన్న పరిస్థితిలో ఇంత పెద్ద సంస్థ వస్తుందా? పెట్టుబడులు పెడుతుందా? అనే ప్రశ్నలు వచ్చాయి. అయినా.. తన ప్రయత్నాన్ని సాగించారు. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్(కేరళ వాసి) తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు.
ఒకసారి కాదు..రెండు సార్లు కాదు.. ఇలా నాలుగైదు రోజులు ఆయన కార్యాలయం చుట్టూ తిరిగారు. చివరకు ఒప్పించారు. ఈ సంస్థ ఏపీకి వచ్చేందుకు ఏం కావాలో.. అన్నీ చేశారు. కేవలం పర్యటించి వచ్చేయడమే కాకుండా.. ప్రతి రోజూ సంస్థతో టచ్‌లో ఉన్నారు. వారిని ఫాలో అప్ చేశారు. విశాఖలో ఏర్పాట్లను స్వయంగా చూశారు. సీఎం చంద్రబాబు సహకారంతో ఈ కార్యం సాకారం అయ్యేలా అనేక ప్రయత్నాలు చేశారు. ఖచ్చితంగా ఏడాది కాలంలోనే దీనిని ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్ ప్రయత్నాన్ని.. కృషిని మెచ్చుకోకుండా ఉండలేం.