hyderabadupdates.com movies చాందిని చౌద‌రిని లిప్ లాక్ కోసం బ‌ల‌వంతం చేస్తే..

చాందిని చౌద‌రిని లిప్ లాక్ కోసం బ‌ల‌వంతం చేస్తే..

చాలా ఏళ్ల నుంచి తెలుగులో తెలుగు హీరోయిన్లు న‌టించ‌డం త‌గ్గిపోతోంది. తెలుగు హీరోయిన్లు రావ‌డ‌మే త‌క్కువ అంటే.. వాళ్ల‌కు మంచి ఛాన్సులూ ద‌క్క‌వు. పెద్ద సినిమాలు చేయ‌క‌పోయినా.. చేసిన వాటిలో మంచి పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్న తెలుగ‌మ్మాయి చాందిని చౌద‌రి. మ‌ను, క‌ల‌ర్ ఫొటో, గామి.. ఇలా త‌న ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నంగా నిలిచిన చిత్రాలు చాలానే ఉన్నాయి. కొంచెం గ్యాప్ త‌ర్వాత ఆమె సంతాన ప్రాప్తిర‌స్తు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో త‌న‌కు మంచి పాత్రే ద‌క్కింది. ఈ సినిమా ప్రమోష‌న్ల‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో తాను న‌టించిన ఒక సినిమా విష‌యంలో తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ సంద‌ర్భాన్ని చాందిని చౌద‌రి గుర్తు చేసుకుంది.

అర్జున్ రెడ్డి సినిమా రిలీజై పెద్ద హిట్ట‌యిన టైంలోనే తాను ఒక సినిమాలో న‌టించాన‌ని.. అందులో ముందు లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లు ఏమీ లేవని.. కానీ అర్జున్ రెడ్డి స‌క్సెస్ నేప‌థ్యంలో అలాంటి సన్నివేశాలు ఉంటేనే సినిమాలు ఆడతాయ‌నే భావ‌న‌కు ఆ సినిమా టీం వ‌చ్చింద‌ని చాందిని చెప్పింది. ద‌ర్శ‌కుడు, నిర్మాత‌తో పాటు టీంలో ముఖ్యులైన కొంద‌రు.. ముద్దు స‌న్నివేశాలు, ఇంటిమేట్ సీన్ల కోసం త‌న‌ను బ‌ల‌వంతం చేశార‌ని ఆమె చెప్పింది. తాను నో చెప్పినా విన‌లేద‌ని.. త‌ప్ప‌క ఆ సీన్లు చేయాల్సిందే అని తేల్చి చెప్పార‌ని చాందిని గుర్తు చేసుకుంది. 

సినిమా ఫ్లాప్ అయితే నీదే బాధ్య‌త అంటూ త‌న‌ను బ్లాక్‌మెయిల్ కూడా చేశార‌ని.. దీంతో త‌న‌కు కాళ్లు చేతులు ఆడ‌లేద‌ని.. ఏం చేయాలో పాలుపోలేద‌ని ఆమె చెప్పింది. ఐతే అదే స‌మ‌యంలో టీం వెళ్లి హీరోకు విష‌యం చెప్ప‌గా.. హీరోయిన్‌కు అవి ఓకేనా అని అడిగాడ‌ని.. హీరోయిన్‌దేముంది, ఇష్ట‌మున్నా లేక‌పోయినా చేయాల్సిందే అంటూ హీరో మీద ఒత్తిడి తెచ్చార‌ని.. అప్పుడా హీరో త‌న కోసం నిల‌బ‌డ్డాడ‌ని.. ఆమె ఓకే ఆన్నా కూడా తాను ఆ సీన్స్ చేయ‌న‌ని తేల్చి చెప్పేశాడ‌ని చాందిని వెల్ల‌డించింది. చాందిని ఆ సినిమా పేరు చెప్ప‌క‌పోయినా.. ఆమె చెప్పిన టైమింగ్ అదీ గ‌మ‌నిస్తే అది రాహుల్ ర‌వీంద్ర‌న్‌కు జోడీగా చాందిని న‌టించిన‌ హౌరా బ్రిడ్జ్ అని అర్థ‌మ‌వుతోంది.

Related Post