జగన్ హయాంలో ప్రభుత్వ సలహారులను లెక్కకు మించి నియమించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా నియమించిన సలహాదారుల్లో మెజారిటీ సలహాదారులు రాజకీయాలకు సంబంధించిన వారే ఉన్నారని, జగన్ సన్నిహితులను సలహాదారులుగా నియమించుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
అయితే, కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సమాజ హితం కోరి ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులను ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తోంది.
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావును ఏపీ ప్రభుత్వ విద్యార్థులు, నైతిక విలువల సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. అంతేకాదు, ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ కోవలోనే తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డా.మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వం నియమించింది.
ఏపీ ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు నేచురోపతి సలహాదుడి పదవిలో డా.మంతెన సత్యనారాయణ రాజు కొనసాగనున్నారు. ప్రకృతి వైద్యం, యోగాసనాల ద్వారా ప్రజలకు నేచురోపతి వైద్యాన్ని మంతెన రెండు దశాబ్దాలుగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఎండోమెంట్స్ సలహాదారుడిగా పోచంపల్లి శ్రీనివాస్ ను ప్రభుత్వం నియమించింది.